విద్యానగర్, జూన్ 20 : గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష కోసం ప్రిలిమ్స్ నుంచి 1:100 చొప్పున ఎంపిక చేసేలా చూడాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ను గ్రూప్-1 అభ్యర్థులు గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. నాలుగేళ్లలో మూడు సార్లు గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయడంవల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని బండి సంజయ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా పట్టించుకోవడం లేదని ఆయన ఎదుట వాపోయారు.
గ్రూప్-1 పోస్టులు అత్యధికంగా ఉండటంవల్ల 1: 50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తే నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని, కేరళ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్‌కు 1:75 చొప్పున ఎంపిక చేసిన విషయాన్ని వివరించారు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే భారీ ఎత్తున ధర్నా చేస్తామన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల డిమాండ్ న్యాయమైనదేనన్న బండి సంజయ్ వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.