Chigurumamidi | చిగురుమామిడి, ఆగస్టు 18 : వర్షా భావ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలను పెంపొందించుకునేందుకు జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫారం పాండ్ పనులను మండల వ్యాప్తంగా ప్రారంభించినట్లు ఎంపీడీవో రామ్మోహన్ చారి, సర్పంచ్ ఆకవరం భవాని అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో మంగళవారం జలసిరి కార్యక్రమాన్ని పెనుకుల సధానందం రైతు భూమిలో ఫారం పాండ్ పనులను ముగ్గు పోసి ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ జలసిరి అవకాశాన్ని ప్రతీ రైతు సద్వినియోగం చేసుకొని బావులలో భూగర్భ జలాలు పెంపొందించే దిశగా ముందుకు వెళ్లాలన్నారు. మండలంలోని 11 గ్రామాల్లో 33 పారం పాండ్ పనులకు మంజూరు కావడం జరిగిందని, ఇట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ఏపీఎం రజిత, ఏపీవో రాజు, టి ఏ శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.