హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : చారిత్రక వరంగల్ నగరాన్ని దేశపటంలో సువర్ణాక్షరాలతో నిలిపిన దక్షిణ భారత తొలి ప్రధాని, తెలుగు బిడ్డ దివంగత పీవీ నరసింహారావు గౌరవార్థం వరంగల్ మామునూరు విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మామునూరు విమానాశ్రయం విశిష్టత, దానితో పీవీకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మామునూరు విమానాశ్రయం ఒక రవాణా కేంద్రమే కాదు, అది దేశ పటంలో వరంగల్ స్థానానికి, మన ఆత్మగౌరవానికి ప్రతీక’ అని గతంలో పీవీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
దేశ ప్రధానిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావుతోపాటు ఎందరో జాతీయ నాయకులు, రాష్ట్రపతులు, ప్రధానుల రాకపోకలకు ఈ చారిత్రక విమానాశ్రయం వేదికగా నిలిచిందని తెలిపారు. 1985లో మామునూరు ఎయిర్‌పోర్టు నుంచి పీవీతో కలిసి ప్రయాణించానని గుర్తుచేశారు. దేశంలో ఆర్థిక సంసరణలు తెచ్చి భారత్‌ను అభివృద్ధి పథంలో నడిపిన పీవీ పేరును ఈ ఎయిర్‌పోర్టుకు పెట్టడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఏండ్లుగా మూతపడి నిర్లక్ష్యానికి గురైన మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించేందుకు తాము నిరంతరం శ్రమించినట్టు తెలిపారు. మామునూరు విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వరంగల్ రూపురేఖలే మారిపోతాయని పొన్నాల ఆశాభావం వ్యక్తంచేశారు.
పీవీ పేరు పెట్టాలని సీఎంకు లేఖ..
మామునూరు విమానాశ్రయానికి మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కోరుతూ పీవీ నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సీఈవో డాక్టర్ సుధాకిరణ్ నచ్చరాజు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లా లక్నేపల్లిలో జన్మించిన పీవీ గ్రామీణ నేపథ్యం నుంచి దేశ అత్యున్నత ప్రధాని పదవిని అధిష్టించారని, ఆయన అంకితభావం, త్యాగం, ప్రజాసేవ యావత్ దేశానికే గర్వకారణమని లేఖలో పేరొన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని ఆర్థిక సంసరణలతో ప్రగతిపథం వైపు నడిపించిన దార్శనికుడు పీవీ అని కొనియాడారు. దేశానికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2024లో భారతరత్న పురసారంతో గౌరవించిన విషయాన్ని ప్రస్తావించారు. విమానాశ్రయానికి పీవీ పేరు పెట్టడంతో ఆయన జన్మభూమికి, వరంగల్ చరిత్రకు సముచిత గౌరవం దకడంతోపాటు భవిష్యత్తరాలకు తెలంగాణ ముద్దుబిడ్డ చూపిన స్ఫూర్తిదాయక ప్రయాణం నిరంతరం గుర్తుండిపోతుందని సుధాకిరణ్ ముఖ్యమంత్రిని కోరారు.