హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం జఫర్‌గఢ్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. దాదాపు 300 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తాటికొండ రాజయ్య నేతృత్వంలో వీరంతా సోమవారం గులాబీ గూటికి చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, పార్టీ నేతలు ఏనుగుల రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ఉద్యమాల్లో బాపూజీ పాత్ర చిరస్మరణీయం: కేటీఆర్
స్వాతంత్య్ర పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీర్తించారు. ఆయన వర్ధంతి సందర్భంగా సోమవారం ఎక్స్ వేదికగా ఘనంగా నివాళులర్పించారు. కేసీఆర్ నేతృత్వంలో కొండా లక్ష్మణ్ నివాసమైన జలదృశ్యంలో టీఆర్ఎస్ పురుడు పోసుకున్నదని గుర్తుచేశారు.