Bonala Jatara | మంథని, జూలై 16: గంగమ్మ తల్లి బోనాల జాతర వేడుకలను గంగపుత్ర బెస్తలు బుధవారం అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుపుకున్నారు. ప్రత్యేకంగా ఆలంకరించిన పల్లకిలో శ్రీ గంగామాత విగ్రహాన్ని ఉంచి కొబ్బరి కాయ కొట్టి గంగమ్మ తల్లి బోనాల వేడుకను ప్రారంభించారు. గంగాపుత్ర బెస్తలు తమ సంపద్రాయ వృత్తి అయిన చేపలు పట్టే పెద్ద వలన అందంగా ఆలంకరించి ప్రదర్శిస్తుండగా, మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని ర్యాలీగా గోదావరి వరకు తరలి వెళ్లారు.
ర్యాలీలో భాగంగా ప్రధాన రస్తాలో డీజే సౌండ్స్‌తో పాటు సంప్రదాయల నృత్యాలు చేయడంతో పాటు చేపలు పట్టే విధానాలను ప్రదర్శించారు. అదే విధంగా డప్పు కళాకారులతో సైతం ప్రత్యేక నృత్యాలు చేశారు. గంగపుత్ర బెస్తలు నిర్వహించిన బోనాల వేడుకలను పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆనంతరం గోదావరి తీరం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దెపై గంగమ్మ తల్లి, గౌరమ్మ, మత్స్యగిరింద్ర, చేప, తాబేలు ప్రతిమలను పెట్టి వివిధ రకాల పూలు, పసుపు, కుంకుమలతో ప్రత్యేకంగా పూజించారు. ఆనంతరం గంగ, గౌరమ్మలతో పాటు మత్స్యగిరింద, చేప, తాబేలు ప్రతిమలను గోదావరిలో నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా అమ్మవారికి సమర్పించిన బోనాలను గంగాపుత్రులు ప్రసాదంగా స్వీకరించడంతో పాటు సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో గంగాపుత్ర సంఘం నాయకులు అంకరి కుమార్, గంధం వెంకటస్వామి, అంకరి ప్రకాశ్, అంబటి సతీష్, అంబటి శ్రీనివాస్, గట్టయ్య, సౌళ్ల స్వామి, అటికేటి నరేష్, అంకరి శివమురళీ, అటికేటి కోటేష్, మోసం నర్సయ్య, జీదుల రాజేందర్, మోసం శంకర్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.