కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 13 : వాగేశ్వరీ డిగ్రీ , పీజీ కళాశాలలో విద్యార్థుల ప్రతిభను గౌరవిస్తూ అకాడమిక్ వేడుకలను సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. విద్య, క్రీడలతో పాటు ఇతర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ వేడుకలకు వాగేశ్వరీ విద్యాసంస్థల చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రతిభావంతులైన విద్యార్థులను స్వయంగా సత్కరించి మెమెంటోలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి నిగమా ఇంజినీరింగ్ కాలేజ్ జాయింట్ సెక్రటరీ రత్న గోపాల్ రెడ్డి హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాలు అందించారు. చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి విద్యాసంస్థల ప్రగతిని వివరించి, విశ్వవిద్యాలయ పరిధిలో ఫలితాలు, అడ్మిషన్లు, క్రీడలు మరియు అన్ని రంగాల్లో ఈ సంస్థ అగ్రస్థానంలో నిలుస్తోందని గర్వంగా పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ, తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రతి విద్యార్థి జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆ లక్ష్యాల సాధన కోసం పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన ప్రేరేపించారు.
విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా, భవిష్యత్లో ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. పెద్ద కలలు కనాలని, వాటిని నిజం చేసుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వాగేశ్వరీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సతీష్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ లింగమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ చైతన్య, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నిజాం, ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.