కరీంనగర్ తెలంగాణచౌక్, సెప్టెంబర్ 26: పెండింగ్ వేతనాల కోసం గ్రామ పంచాయతీ కార్మికులు రోడ్డెక్కారు. ఈ మేరకు శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో కలెక్టరేట్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నాలు చేశారు. గంటలపాటు అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని, అవి కూడా మూడు నెలలుగా రాక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
సద్దుల, దసరా పూట చేతిలో రూపాయి లేదని, పండుగలు ఎట్ల ఎల్ల్లదీయాలని ఆవేదన చెందారు. తమను గోస పెట్టవద్దని, ప్రభుత్వం దయచూపి పెండింగ్ వేతనాలు ఇప్పించాలని వేడుకున్నారు. లేకుంటే పండుగ రోజు పస్తులే ఉండాల్సి వస్తుందని కంటతడి పెట్టారు. కరీంనగర్లో యూనియన్ సహాయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ కార్మికులంటే ప్రభుత్వానికి చులకనగా మారిందని విమర్శించారు.
పండుగ పూట కార్మికులకు వేతనాలు చెల్లించడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవా..? అని ప్రశ్నించారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ, దసరా పండుగలకు బట్టలు అందించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ధర్నాలో నాయకులు శ్రీనివాస్, సుధాకర్, సమ్మయ్య, సదయ్య, మధునమ్మ, తదితరులు పాల్గొన్నారు.