KARIMNAGAR | కలెక్టరేట్, ఏప్రిల్ 09 : జిల్లాలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు లేకుండా ధాన్యం సేకరించాలని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ సూచించారు. ధాన్యం కొనుగోళ్లు, ఏకరూప దుస్తుల కుట్టు పని, ఇతర కార్యక్రమాల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సెర్ఫ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు డాటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు సకాలంలో కుటించి, సంబంధిత పాఠశాలలకు అందజేయాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్ల జరిగిన పనులు పరిశీలించాలని సూచించారు. గ్రామ సమాఖ్యలో విధులు నిర్వహించే వీవోఏల వేతనాలు వివో సమావేశంలో తీర్మాణం చేస్తూ, సకాలంలో వారికి చెక్కుల ద్వారా చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సంస్థలో నిర్వహిస్తున్న ఆర్థిక లావాదేవీలపై నిబద్ధతతో పనిచేయాలని, అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రాజెక్టు పురోభివృద్ధికి కృషి చేయాలన్నారు. వీవోఏల వేతనాల్లో ఎలాంటి పొరపాట్లు జరిగినా, సంబంధిత బాధ్యులను విధుల నుంచి తొలగించి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయటం జరుగుతుందన్నారు. సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా డిఆర్డివోకు గాని, తనకు గానీ నేరుగా తెలపాలన్నారు. సమావేశంలో డిఆర్డివో శ్రీధర్, అదనపు డిఆర్డివో సునీత, స్త్రీనిధి ఆర్ఎం, డిపిఎంలు, ఎపిఎంలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.