Gangadhara | గంగాధర, ఏప్రిల్ 20 : ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, గంగాధర సింగిల్విండో చైర్మన్ దూలం బాలగౌడ్ నిర్వాహకులకు సూచించారు. మండలంలోని మంగపేట, చర్లపల్లి(ఎన్), కోట్లనర్సింహులపల్లి, నాగిరెడ్డిపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రాలకు ధాన్యం వెల్లువెత్తుతున్న సందర్భంగా రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.రైతులకు అవసరమైన గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచాలన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ ఛైర్మన్ వేముల భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమళ్ల మనోహర్, సింగిల్ విండో డైరెక్టర్ బెజ్జంకి కళ్యాణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పెంచాల చందు, దీకొండ మధు, ముచ్చె శంకరయ్య, నాయకులు రామిడి రాజిరెడ్డి, తోట మల్లారెడ్డి, తోట సంధ్య, దాతు అంజి, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.