రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ పోలింగ్ కేంద్రం దగ్గర ఓటు వేసేందుకు పట్టభద్రులు బారులుతీరారు.
రత్నాపూర్ గ్రామం మంథని, పెద్దపల్లి ప్రధాన రహదారికి చేరువల ఉంది. ఈ గ్రామంలో పట్టభద్రుల సంఖ్య ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌తోపాటు వివిధ పట్టణాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కొలువులు చేస్తున్న వారంతా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రత్నాపూర్ తాజా మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ, సీనియర్ జర్నలిస్ట్ పీవీరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ పల్లె అనిత, సాఫ్ట్వేర్ ఇంజినీర్ బుర్ర ప్రణయ్ కుమార్ గౌడ్ ఇక్కడ ఓటు వేసిన వారిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కరీంనగర్ కలెక్టరేట్ : కరీంనగర్‌లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. డాక్టర్ స్ట్రీట్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ సరళి గురించి ప్రిసైడింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.
త్రిపురారంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ జరుగుతోంది. త్రిపురారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభంకాగా 10 గంటల వరకు 16 ఓట్లు పోలయ్యాయి. రూట్ ఆఫీసర్ జంగాల కృష్ణయ్య, తాసిల్దార్ గాజుల ప్రమీల ఈ విషయాన్ని వెల్లడించారు.