కరీంనగర్ కమాన్‌చౌరస్తా, నవంబర్ 7 : నైపుణ్యం, నిరంతర అభ్యాసాలే విజయానికి దోహదం చేస్తాయని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో గొప్ప స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఏ గడ్డపై ఉన్నా తెలంగాణ మట్టి పరమళాన్ని మరువద్దని, విద్యార్థి దశ నుంచే సేవా మార్గాన్ని అనుసరించాలని సూచించారు. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో శుక్రవారం రెండో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ జేబీ రావు, శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ యూ ఉమేశ్కుమార్తో కలిసి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 25 మందికి పీహెచ్డీ పట్టాలతోపాటు 2018 నుంచి 2023 వరకు ప్రతిభ చూపిన 130 మందికి 161 బంగారు పతకాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం విద్యారంగం సాంకేతికతతో ముందుకు సాగుతున్నదని, డిజిటల్ లెర్నింగ్ భౌగోళిక అవరోధాలను అవకాశాల మధ్య వ్యత్యాసాలను చెరిపివేసిందని తెలిపారు.
శాతవాహన విశ్వవిద్యాలయానికి న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ దిశగా అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రపంచ విజ్ఞానాన్ని ఆహ్వానించాలని, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందిపుచుకోవాలని సూచించారు. అవకాశం, సమానత్వం సృజనాత్మకతతో ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతిభ ఎకడైనా వికసిస్తుందని, భయాన్ని, అలసటను అధిగమించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అందరూ సమానంగా జీవించే సమాజమే నిజమైన అభివృద్ధి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, మాజీ వీసీలు, బంగారు పతకాల డోనర్లు, తదితరులు పాల్గొన్నారు.
శాతవాహన విశ్వవిద్యాలయం స్థాపించినప్పటి నుంచి మంచి ఫలితాలు సాధిస్తున్నది. ఉత్తర తెలంగాణ ఉన్నత విద్యకు కీలక కేంద్రంగా మారింది. గ్రామీణ యువతకు, సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడంలో ముందు ఉండడం హర్షణీయం. ఆరు విద్యా
సంవత్సరాల్లో 1,03,454 మంది అండర్ గ్రాడ్యుయేట్లలో 55 వేలకు పైగా విద్యార్థులు పట్టభద్రులయ్యారు. మొత్తం 34,561 మందిలో 25,310 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు తమ డిగ్రీలను విజయవంతంగా పూర్తి చేశారు. శాతవాహనలో ఎంఫార్మసీ, ఎల్ఎల్బీ, బీటెక్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా
విశ్వవిద్యాలయం తన విద్యా పరిధులను విస్తరిస్తూనే ఉన్నది. శాతవాహన వంటి విశ్వవిద్యాలయాలు బాధ్యతాయుతమైన పౌరులు, ఆవిషర్తలు, సమగ్రతతో దేశ పురోగతికి దోహదపడే నాయకులను తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషించాలి.
– జేబీ రావు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్
నేను గతేడాది అక్టోబర్ 19న వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించా. అప్పటి నుంచి అన్ని రంగాల్లో యూనివర్సిటీ ప్రమాణాలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న 156 కళాశాలల్లో వివిధ ప్రొఫెషనల్ కోర్సులను అందిస్తున్నాం. 2025-26 విద్యా సంవత్సరం నుంచి
కొత్తగా ఎంఫార్మసీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బీటెక్ కోర్సులు ప్రవేశ పెట్టాం. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన గ్రామీణ యువతకు, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన యువతకు ఉన్నత విద్యను అందించడానికి అంకిత భావంతో ముందుకెళ్తున్నాం. సిల్ డెవలప్మెంట్
సెంటర్ ఏర్పాటు చేశాం. ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నాం. అలాగే, యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాం.
– వీసీ ఉమేశ్ కుమార్, శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్