Godavarikhani | జ్యోతినగర్(రామగుండం), జూన్ 23 : రామగుండంలో మూతపడిన 62.5మెగావాట్ల బీ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ సందర్శించారు. రాష్ట్ర జెఎన్‌కో సీఎండీ ఎస్ హరీశ్, థర్మల్ అండ్ ప్రాజెక్టు డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డితో కలిసి ప్లాంటును సందర్శనతో యంత్రాలను మంగళవారం పరిశీలించారు. పనికి వచ్చే యంత్రాల జాబితాను తయారు చేయాలని సూచించారు. అనంతరం కాన్ఫెరెన్స్ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ ప్లాంటు స్థానంలో కొత్తగా చేపట్టనున్న 800మెగావాట్ల ప్లాంటు నిర్మాణంకు కావాల్సిన వనరులపై ఇంజినీర్లతో సమీక్ష చేశారు.
పాత ప్లాంటుకు చెందిన భూమి, కొత్త ప్లాంటు నిర్మాణంకు ఇంకాను ఏ మేరకు ప్రభుత్వ, ప్రవేటు స్థల సేకరణ అంశాలు, కొత్త ప్లాంటుకు చెందిన డీపీఆర్‌పై చర్చించారు. అలాగే ప్లాంటు మెటీరియల్స్‌ను వెస్ట్ చేయకుండా ఇతర జెన్కో పవర్ ప్లాంటులకు తరలించాలని సూచించారు. అనంతరం ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్టేషన్‌ను ప్రత్యేక కార్యదర్శి సందర్శించారు. విద్యుదుత్పత్తి నమోదు వివరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక కార్యదర్శిని రామగుండం నగరపాలక డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు కలిసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కోసం 800మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను వేగంతం చేయాలని విన్నపించారు. ఇక్కడ బీ థర్మల్ విద్యుత్ కేంద్రం ఇన్చార్జి ఎస్ఐ శంకరయ్య, ఆపరేషన్ అండ్ మెయింటెన్సీ డీఈ కే శ్రీనివాసరావు, స్టోర్స్ డీఈ టీ కృష్ణమూర్తి, కార్మికులతో కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు.