వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. కంపు కొట్టే పరిసరాలు, వసతుల లేమి మధ్యే బుధవారం పునఃప్రారంభమయ్యాయి. పిల్లలంతా ఆటాపాటలకు టాటా చెప్పి బడిబాట పట్టగా.. మొదటి రోజు దాదాపు అంతటా సమస్యలు స్వాగతం పలికాయి. ‘ఇటు తరగతులు.. అటు అసౌకర్యాలు’ అన్నట్టు కనిపించగా.. విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. గత బీఆర్ఎస్ సర్కారు ప్రారంభించిన సీఎం బ్రేక్ఫాస్స్కీంకు బ్రేక్ పడగా, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్ఖానగడ్డ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోయింది. ఇంకా ప్రారంభంరోజే పుస్తకాలు, యూనిఫాంలు ఇస్తామని ఊదరగొట్టిన యంత్రాంగం, సగం స్కూళ్లలోనే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నది.
కరీంనగర్, జూన్ 12 (నమస్తే తెలంగాణ)/ కమాన్చౌరస్తా : వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు బుధవారం తిరిగి తెరుచుకున్నాయి. మొదటి రోజు ఉమ్మడి జిల్లాలో మెజార్టీ చోట్ల సమస్యలే స్వాగతం పలికాయి. విద్యార్థులు తక్కువ సంఖ్యలోనే హాజరయ్యారు. విద్యార్థుల సంఖ్య అంతంతే ఉన్న అనేక చోట్ల ఒక్కరిద్దరు మాత్రమే వచ్చారు. ఉపాధ్యాయులు మాత్రం పూర్తి స్థాయిలో కనిపించారు. సగం పాఠశాలల్లో మాత్రమే యూనిఫాం దుస్తులు పంపిణీ చేశారు. కొన్ని పాఠశాలల విద్యార్థులకు మాత్రమే పాఠ్య పుస్తకాలు అందించారు. ఉదయం 9 గంటలకే ఇంటి నుంచి వచ్చిన పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ అందించక పోవడంతో ఖాళీ కడుపులతోనే విద్యార్థులు తరగతులకు వెళ్లారు. మధ్యాహ్న భోజనం మాత్రం పెట్టినా, పూర్తి స్థాయిలో అమలు కాలేదు.
నమస్తే ఎఫెక్ట్ : కరీంనగర్ కార్ఖానగడ్డ ప్రభుత్వ పాఠశాలలో ఫ్యాన్ల రెక్కలు వంగిపోయాయని ప్రచురించిన ఫొటో కథనానికి అధికారులు స్పందించారు. వెనుకాల బ్లాక్ కలర్ పాత ఫ్యాన్ రెక్కలు సరిచేయగా, ముందు భాగంలో కొత్త ఫ్యాన్ అమర్చారు.
తరగతులు ప్రారంభమైన రోజునే పాఠ్య పుస్తకాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కొన్ని పాఠశాలలకే పరిమితమైంది. కొన్ని పాఠశాల్లో ప్రజా ప్రతినిధులు, మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందించారు. కొన్ని పాఠశాలలకు పాత పుస్తకాలు అందగా, వాటిపై కేసీఆర్ ఫొటోలు ఉన్నాయని పంపిణీ చేయకుండా ఆపేసినట్లు తెలుస్తున్నది. దాదాపు అన్ని పాఠశాలల్లో స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో యూనిఫామ్స్ అందరికీ అందలేదు. ఏజ్ గ్రూప్ వారీగా ఒకే సైజ్లో కుట్టించిన యూనిఫామ్స్ కొందరు విద్యార్థుల కొలతకు సరిపోలేదు. వాటిని ఎలా వాడాలని కొందరు విద్యార్థులు ఉపాధ్యాయులను ప్రశ్నించారు. కుట్టులో కూడా నాణ్యత లేక పోవడంతో చాలా మంది పెదవి విరిచారు. యూనిఫాం దుస్తుల్లో కూడా నాణ్యత లేదని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆరోపిస్తున్నారు.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సమయం కుదించడంతో చాలా మంది విద్యార్థులు ఖాళీ కడుపులతోనే హాజరయ్యారు. గతంలో ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ ఇస్తారనే నమ్మకంతో ఇంట్లో ఏమీ తినకుండానే వచ్చిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. గతంలో ఎంపికైన పాఠశాలల్లో మొదటి రోజు బ్రేక్ ఫాస్ట్ ఊసే లేదు. దీంతో ఖాళీ కడుపుతో హాజరైన విద్యార్థులు మధ్యాహ్న భోజనం వరకు ఏమీ తినకుండానే క్లాసుల్లో కూర్చుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్ఖానగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రార్థన సమయంలో ఓ విద్యార్థి కండ్లు తిరిగి పడిపోయింది. ఉపాధ్యాయులు ఆమెను పాఠశాలలోని ఓ గదిలోకి తీసుకెళ్లి నీళ్లు తాగించి కాసేపు పడుకోబెట్టారు. అక్కడక్కడ మధ్యాహ్న భోజనం వండి పెట్టారు. విద్యార్థుల సంఖ్య అంతగా లేని పలు పాఠశాలల్లో చేతులెత్తేశారు. గతంలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పేరిట మండలానికి నాలుగైదు పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో ప్రతి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించే వారు. ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తున్నది. గతంలో అమలైన పాఠశాలల్లోనైనా ఇది ఉంటుందా..? లేదా..? అన్న సందేహం వ్యక్తమవుతున్నది.
50 రోజుల సెలవుల తర్వాత బుధవారం స్కూల్ రీ ఓపెన్ కాగా, చాలా పాఠశాలల్లో చెత్తాచెదారం, అపరిశుభ్రత కనిపించింది. తరగతి గదులు, పరిసరాలను శుభ్రం చేసే సిబ్బంది లేకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చింది. పెద్దపల్లి జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో వర్షపు నీరు నిలిచి అధ్వానంగా కనిపించింది. ఇక మూత్రశాలలు, మరుగుదొడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. నిర్వహణ లేక ఎక్కడ చూసినా కనీసం ఉపయోగించలేని స్థితిలో ఉన్నాయి. ‘అమ్మ ఆదర్శ పాఠశాలల’ పేరిట కొత్త పథకాన్ని తెచ్చి ఆధునీకరణ, మరమ్మతు పనులు చేపట్టినా అవి నత్తనడకన సాగుతుండడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వేసవి సెలవుల్లో పనులు పూర్తి కాకపోవడంతో ఓ వైపు పనులు, మరోవైపు తరగతుల నిర్వహణ విద్యార్థుల చదువుకు ఆటంకంగా మారింది. దాదాపు అనేక చోట్ల పిల్లలు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక మెజార్టీ చోట్ల కనీసం గంట కొట్టేందుకు అటెండర్ల దిక్కు కూడా లేకపోయింది. ప్రభుత్వం స్పందించి అటెండర్ల స్థానంలో కనీసం సావెంజర్లను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్ధేశంతో జూన్ 6 నుంచి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించినా, అది మొక్కుబడిగానే సాగిందనే విమర్శలు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో చూస్తే మంగళవారం వరకు 64 మంది విద్యార్థులే చేరారు. ఈ కార్యక్రమం ఈ నెల 19వ తేదీ వరకు ఉన్నా, కొత్తగా పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందనే ఆలోచన ఉన్నతాధికారుల్లో లేకుండా పోయింది.