Government schools | సుల్తానాబాద్ రూరల్, జూన్13: ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులను కల్పించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి మాధవి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండల ప్రాథమిక పాఠశాల గర్రెపల్లి లో విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నాయని ఈ సదుపాయాలను గ్రామస్తులు వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు ప్రైవేట్ పాఠశాలల కంటే చక్కగా ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యావంతులైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని గుర్తు చేశారు. విద్యార్థులకు మంచి విద్యను అందించడం జరుగుతుందన్నారు.
పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం, రాగి జావ అందించడం జరుగుతుందన్నారు. గర్రెపల్లి పాఠశాలలో తల్లిదండ్రులు అన్ని కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటున్నారని ప్రశంసించారు. అంతకు ముందు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు.పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్, లైబ్రరీ, బుక్స్, ప్రొజెక్టర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజయ్య , పాఠశాల ఏ ఏపి సి చైర్ పర్సన్ గౌతమి , ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు అశోక్ కుమార్ , విద్యార్థుల, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.