మలి సంధ్యలోని పండుటాకులకు (వృద్ధులకు) రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాలో ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమం నిర్మాణం పూర్తి చేసుకున్నది. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీశివారులో మూడెకరాల్లో 93 లక్షలతో నిర్మాణం పూర్తయింది. నేడు అమాత్యుడి చేతుల మీదగా ప్రారంభోత్సవం చేసుకోనున్నది.
సిరిసిల్ల రూరల్, జూన్ 13 : అరవై ఏండ్లుపై బడి ఎవరూ లేని వృద్ధులకు ఆశ్రయం కల్పించనున్నారు. వసతితోపాటు ఆనందంగా గడిపేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ ఆశ్రమంలో 40 మంది ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. వీరికి అందుబాటులో వైద్యంతోపాటు ఫిజియోథెరపీ, వినోదం కోసం టీవీ ఏర్పాటు, ఆటలు ఆడిపించడం, ఆహ్లాదం కోసం పార్క్‌ను ఏర్పాటు చేశా రు. ప్రత్యేకంగా రెండు డార్మెటరీ గదులు, కిచెన్, డైనింగ్ హాలు, ఆటల కోసం కేటాయించిన గదిలో క్యారం, చెస్, టెబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. భవన ప్రాంగణంలో పార్క్ , విశ్రాంతి తీసుకునేందుకు బెంచీలు ఏర్పాటు చేశా రు.
వెస్ట్రన్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. భవనం లో సూపరింటెంండ్, కుక్, ముగ్గురు సహాయకు లు ఉంటారు. వృద్ధులకు ఉదయం యోగ చేయిస్తారు. తర్వాత టిఫిన్, టీవీ చూడడం, పేపర్ రీ డింగ్తోపాటు కాలక్షేపం కోసం ఇతర పనులు చేసుకునేలా చూస్తారు. మధ్యాహ్నం లంచ్ పెట్టి, తర్వాత కాలక్షేపం కోసం ఆటలు, భవనంలో ఏర్పాటు చేసిన పార్క్‌లో సేద తీరుతారు. ఇండోర్‌తోపాటు అవుట్ డోర్‌లోనూ ఆటలు ఆడిస్తారు. రాత్రి వేళలో భోజనం అందిస్తారు. ఇలా వృద్ధుల ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ భరోసా కల్పిస్తారు.
మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమం ఏర్పాటు చేయడం హర్షణీయం. పిల్లలు లేని వృద్ధులు, పోషించుకునే స్థితిలో లేని వారికి ఆశ్రమంలో చేరడానికి అవకాశం కల్పించారు. వారి సంరక్షణ అందరి బాధ్యత. అన్ని వసతులతో తంగళ్లపల్లి మండలంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. వృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఎంపీపీ పడిగెల మానస,తంగళ్లపల్లి
ప్రభుత్వమే ఏర్పాటు చేయడం సంతోషకరం
ప్రభుత్వమే వయో వృద్ధుల ఆశ్రమం ఏర్పాటు చేయడం సంతోషకరం. ప్రభుత్వం మంచి ఆలోచన చేసింది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తంగళ్లపల్లిలో ఏర్పాటు చేశారు. వయో వృద్ధులు, పోషించే స్థోమత లేని వారిని వృద్ధాశ్రమంలో చేర్పించాలి. సద్వినియోగం చేసుకోవాలి. వృద్ధులకు కావాల్సిన వసతులతో ఆహ్లాద వాతావరణంలో భవనం నిర్మించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– పుర్మాణి మంజుల, జడ్పీటీసీ ,తంగళ్లపల్లి
ఆధునాతన వసతులతో ఏర్పాటు
అధునాతన వసతులతో వయో వృద్ధుల ఆశ్రమం నిర్మాణం చేశారు. వృద్ధులకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేశాం. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో వృద్ధాశ్రమాన్ని నిర్మించారు. 60 సంవత్సరాలు పైబడిన వారిని ఆశ్రమంలో చేర్పించవచ్చు. ఎవరూ లేని, పోషించే స్థోమత లేని వారిని చేర్పించుకుంటాం. వృద్ధుల ఆలనాపాలనా చూసుకునేందుకు సిబ్బంది ఉంటారు. ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశాం.
– లక్ష్మీరాజం, సీడబ్య్యూవో, రాజన్న సిరిసిల్ల