ఒకరిద్దరు కాదు.. 25 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద సర్కారు చెల్లించాల్సిన ఫీజులు విడుదల చేయకపోడమే అందుకు కారణమని తెలుస్తున్నది. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, బకాయిలు రిలీజ్ చేసి చదువులకు అండగా నిలువాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నా కనికరం చూపడం లేదు. దీంతో ప్రవేశాలపై సందిగ్ధత నెలకొనగా.. బకాయిలు విడుదల చేయకపోతే మూసివేయడం తప్ప మరోమార్గం లేదని పాఠశాలల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. దీంతో సంబంధిత వర్గాల తల్లిదండ్రుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విద్యాహక్కు చట్టంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో బెస్ట్ అవైలబుల్ స్కీంను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎంపిక చేసిన 210 ప్రైవేట్ పాఠశాలల్లో 25 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పథకం కింద అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు, బోధన, వసతికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వాలు చెల్లిస్తుండగా, ఏటా షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులకు ఒకటి, 5వ తరగతిలో.. గిరిజన విద్యార్థులకు సంబంధించి 1, 5, 8వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో ప్రవేశం పొందే విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు సామర్థ్య పరీక్షను నిర్వహించి ఎంపిక చేసి.. గుర్తించిన ప్రైవేట్ పాఠశాలలకు కేటాయింపులు చేస్తారు. ఎంపికైన ప్రాథమిక తరగతి విద్యార్థికి ఏడాదికి 28వేలు, ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులకు (వసతితో కలిపి) 42 వేలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. వీటి ద్వారా సదరు పాఠశాలలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఒక్క పైసా విడుదల చేయలేదు.
2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి రూ.వంద కోట్లకుపైగా రావాలని నిర్వాహకులు చెబతున్నారు. ఎస్టీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని బకాయిలు విడుదల చేయాలని కోరుతూ విప్ ప్రస్తుత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టికి తాజాగా లేఖ రాశారు. వెంటనే నిధులు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్‌కు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన ఆ లేఖలో కోరారు. అయినా ప్రభుత్వం మాత్రం కనికరం చూపడం లేదు.
కనీసం ఇస్తామన్న అస్యూరెన్స్ కూడా ఇవ్వడం లేదు. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద తమ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి, వసతి, భోజనం, విద్యను పొందుతున్న ప్రభుత్వాలు, తమకు నిధులను కేటాయించకుండా.. ఇబ్బందులు పెడుతున్న తీరుపై సదరు పాఠశాలల యజమానులనుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. అంతేకాదు, ఈనెల 12 నుంచి విద్యాసంవత్సరం ఆరంభమైంది. కొత్త అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బిల్లులు రాకపోతే నడిపే పరిస్థితి లేదని యాజమాన్యాలు చెబుతున్న తరుణంలో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 13 : బెస్ట్ అవైలబుల్ సూళ్లకు చెందిన హాస్టళ్లలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని ఎస్సీ, ఎస్టీ బెస్ట్ అవైలబుల్ పేరెంట్స్ కమిటీ కరీంనగర్ జిల్లా శాఖ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర కన్వీనర్ సముద్రాల అజయ్‌తో కలిసి కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మంది విద్యార్థులకు 200కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని, ప్రతి క్వార్టర్ వైజ్‌గా విడుదల చేయాల్సిన నిధులు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఈ పథకాన్ని కొనసాగించేందుకు ఆసక్తి ప్రదర్శించడం లేదని, దీంతో నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రీన్‌ఛానల్ ద్వారా పెండింగ్‌లో ఉన్న హాస్టల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు విడుదల చేయాలని కోరారు.
మూడేళ్లుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ పాఠశాలల నిధులు విడుదల కాకపోవడంతో పాఠశాల నిర్వాహకులుగా మేం ఆందోళనకు గురవుతున్నాం. హాస్టల్ విద్యార్థుల కోసం చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక బిల్డింగ్ అద్దెలు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది. ఉపాధ్యాయుల జీతాలు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ నెల 12వ తేదీ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. వెంటనే బెస్ట్ అవైలబుల్ పాఠశాలల నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. ఆ లోగా బకాయిలు విడుదల చేయలేని పరిస్థితుల్లో తక్షణమే బెస్ట్ అవైలబుల్ స్కూల్ బాధ్యత ప్రభుత్వం తీసుకొని పాఠశాలలు నడపాలని కోరుతున్నాం.
– రాపోలు విష్ణువర్ధన్ రావు, ట్రస్మా రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ, బీఏఎస్ స్కూల్ యజమాని
మాకు స్కీంలు కావాలని అడుగడం లేదు. మాకు రావాల్సిన బకాయిలనే అడుగుతున్నాం. రేపు, మాపు వస్తాయి అనుకుంటూ ఇన్నాళ్లుగా అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నడుపుకుంటూ వస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది జరిగినా అది పేద పిల్లల చదువులకు ఆంటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో కష్టాలు ఎదురైనా నడిపాం. కానీ, రోజురోజుకూ ఇది తలకు మించిన భారం అవుతున్నది. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా ఒక్క మాట స్పష్టంగా చెప్పాలి. బకాయిలు ఇస్తారా.. ఇవ్వరా..? ఇస్తే ఎప్పుడిస్తారో ముందుగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే నిలిపివేయడం తప్ప మాకు మారో మార్గం కనిపించడం లేదు. ఇది ప్రభుత్వాన్ని బెదిరించడానికి చెప్పడం లేదు. మా ఆర్థిక పరిస్థితులు సహకరించక ముందుకెళ్లలేక చెబుతున్నాం. ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి బకాయిలు విడుదల చేసి తమకు, విద్యార్థులకు అండగా నిలువాలని కోరుతున్నాం.
– యాదగిరి శేఖర్‌రావు, ట్రస్మాగౌరవాధ్యక్షుడు, బీఏఎస్ పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి