పెద్దపల్లి, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారింది. కొనుగోళ్లలో నిర్లక్ష్యం అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో పడిన అకాల వర్షం రైతన్నను నిండా ముంచింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా సర్కారు కొనకపోవడంతో తడిసి ముద్దయింది. శనివారం వరకు దాదాపుగా 25వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం ఇంకా కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే ఉండగా, వర్షానికి తడిసి పోయింది.
అత్యధికంగా పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, రామగిరి, కమాన్పూర్, జూలపల్లి మండలాల్లో నష్టం వాటిల్లింది. ధాన్యం కొట్టుకుపోగా, రైతులకు దుఃఖమే మిగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల వాన కురిసింది. బోయినపల్లి మార్కెట్ యార్డుతోపాటు మరికొన్ని గ్రామాల్లోని కేంద్రాల్లో ధాన్యం నీటి పాలైంది. వేములవాడలో గంటకుపైగా ఎడతెరిపి లేకుండా పడిన వర్షంతో రాజన్న ఆలయం ఎదుట రహదారి వరదతో నిండిపోయింది.
నేను పెద్దపల్లి మార్కెట్ల వడ్లు ఓసుకొని ఐదు రోజులైతంది. మాయిశ్చర్ వచ్చినా కొనలేదు. మూడు రోజుల నుంచి వానకు వడ్లు తడుస్తున్నయి. ఇయ్యాల బాగా తడిసినయి. ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. చాలా మంది వడ్లు ఇక్కడ కొట్టుకు పోయినయి. అధికారులు, నాయకులు పట్టిచ్చుకోవాలె. మమ్ముల ఆదుకోవాలే.
-అక్కపాక సదయ్య, పెద్దమ్మనగర్ (పెద్దపల్లి)