పెద్దపల్లి, జనవరి 23(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యాశాఖ అస్తవ్యస్తంగా మారింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నా ఆ శాఖ పని తీరు విస్తుపోయే విధంగా ఉన్నది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించడమే లక్ష్యంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు బహుళ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆ పైప్లైన్లతో టీ-ఫైబర్ సేవలను ప్రతి గ్రామానికీ, ఇంటికీ అందించేందుకు కేబుల్ లైన్లను విస్తరించింది. రాష్ట్రంలోని 33 జిల్లాలు, 589 మండలాల్లోని 12,769 గ్రామ పంచాయతీలు, 141 అర్బన్ లోకల్ బాడీల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఇలా మొత్తంగా 60 వేల ప్రభుత్వ సంస్థలకు ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్ను సిద్ధం చేసింది. ఇప్పటికే 9వేల గ్రామాలు, ఫేజ్-1లో 5వేల ప్రభుత్వ పాఠశాలలు కనెక్ట్ అయ్యాయి. జూనియర్ కళాశాలలు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలుగా దీని కవరేజ్‌లో ఉన్నాయి. మొత్తంగా 55వేల ప్రయారిటీ సంస్థల (విద్య, ఆరోగ్య, వ్యవసాయం)కు హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ (20 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్)ను అందిస్తున్నది.
ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు టీ ఫైబర్ సేవలను అనుసంధానం చేసి కనెక్షన్లను ఇచ్చారు. కానీ, ఉన్నత విద్యాశాఖ నుంచి కచ్చితమైన ఆదేశాలు, మానిటరింగ్ లేకపోవడం వల్ల రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు టీ-ఫైబర్ సేవలను పొందలేకపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 430 వరకు ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు ఉండగా, దాదాపుగా 90 శాతం కళాశాలల్లో టీ ఫైబర్ సేవలు అందడం లేదు. ఈ విషయంలో ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు చొరవ చూపకపోవడం వల్ల ఆయా కళాశాలల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల మండలాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది సిస్టంలో ఎంట్రీ చేసిన, అప్లోడ్ చేయాల్సిన డేటాను పెన్ డ్రైవ్‌లలో వేసుకొని మీసేవా కేంద్రాలకు వెళ్లి చేసుకుంటున్నారు. తప్పని సరిగా ఇంటర్నెట్ ద్వారానే ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్, ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన పరీక్షా పత్రాల డౌన్లోడింగ్, పరీక్షల నిర్వహణ అనంతరం ఫలితాల అప్‌లోడింగ్‌కు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

.. పై ఫొటోలో కనిపిస్తున్నది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలోగల టీ ఫైబర్ మోడెం. దీనికి కనెక్షన్ ఉన్నప్పటికీ అసలు సిగ్నలింగ్ లేకపోవడంతో నెట్వర్క్ కనెక్ట్ కావడం లేదు. దీంతో కళాశాలలోని బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను వినియోగించుకొని, ఇంటర్నెట్ సేవలను పొందాల్సి వస్తున్నది. అయితే, బీఎస్ఎన్ఎల్ కూడా సరిగా కనెక్ట్ కాక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నా.. అప్లోడ్ చేసుకోవాలన్నా ప్రైవేటు నెట్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తున్నది.
మొదటికే మోక్షం లేదంటే కొడుకు పేరు గోవిందా.. అన్న చందంగా ఉంది ఇంటర్మీడియెట్ బోర్డు తీరు. అసలు ఇంటర్నెట్ కనెక్షనే లేదంటే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రెండు రెండు చొప్పన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్(ఐఎఫ్‌పీ)బోర్డులు, ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానల్స్(ఐడీపీ) టీవీలు వచ్చాయి. ఇప్పటికే విద్యార్థుల, సిబ్బంది, అధ్యాపకుల ఫేషియల్ రికగ్నైజ్ అటెండెన్స్ (ఎఆర్ఎస్) సిస్టంను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ, అందుకు అనుగుణంగా టీ-ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్ ఉన్నా అందులో నెట్వర్క్ లేకుండా పోయింది. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ తరగతులను బోధించాలని గతేడాదే నిర్ణయించారు. కానీ, దానికి సంబంధించి పూర్తిస్థాయి పనులు చేపట్టలేదు. తరగతి గదుల్లో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికే ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవాలంటే కళాశాలల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ ద్వారానో లేక, సిబ్బంది ఫోన్లలోని హాట్‌స్పాట్ ద్వారానో కనెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంటర్ బోర్డు అధికారులకు కొనుగోళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాల కల్పనపై లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి ఆధీనంలోని ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అక్కడక్కడ మాత్రమే టీ-ఫైబర్ సేవలు అందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఈ-సేవలు అందడం లేదు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 11 బాలుర, 3 బాలికల జూనియర్ కళాశాలలు ఉండగా కమాన్‌పూర్, ఓదెల మండలాల్లోని బాలుర జూనియర్ కళాశాలలకు మాత్రమే టీ-ఫైబర్ సేవలు అందుతున్నాయని పెద్దపల్లి జిల్లా ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి కల్పన తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఐఎఫ్‌పీ బోర్డులు, ఐడీపీ టీవీలు సైతం చేరుకున్నాయని, డిజిటల్ తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.