నాడు బీఆర్ఎస్ పాలనలో కార్పొరేట్‌కు దీటుగా సేవలందించిన సర్కారు దవాఖానల్లో నేడు కనీస సేవలు కరువవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో రూపుదిద్దుకున్న సిరిసిల్ల జిల్లా దవాఖానలో రోగులు గోస పడే పరిస్థితులు వచ్చాయి. బుధవారం స్కానింగ్ సెంటర్ సేవలు నిలిచిపోవడంతో నిండు గర్భిణులు, ఆడబిడ్డలు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. దాదాపు నాలుగు గంటల పడిగాపుల తర్వాత వైద్యులు స్పందించి గర్భిణులకు పరీక్షలు చేసినా.. మిగతా మహిళలు స్కానింగ్ టెస్టులు చేసుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 1 : తెలంగాణ రాక ముందు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానలను రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ సర్కారు బలోపేతం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లాకో పెద్ద దవాఖానను ఏర్పాటు చేసింది. వేలాది కోట్లతో అని సౌకర్యాలూ కల్పించింది. దాంతో ప్రజలకు నమ్మకం ఏర్పడి తాకిడి పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వ వైద్యశాలల్లో పురుడు పోసుకున్న మహిళలకు కేసీఆర్ కిట్లు ఇవ్వడంతో గర్భిణులు పెద్ద సంఖ్యలో రావడం మొదలైంది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానలపై నిర్లక్ష్యం కొనసాగుతున్నది.
అందుకు సిరిసిల జిల్లా దవాఖానే నిదర్శనంగా నిలుస్తున్నది. బుధవారం సుమారు 60 మంది గర్భిణులు, మహిళలు టిఫా, అల్ట్రాసౌండ్, సీటీస్కాన్ పరీక్షల కోసం వచ్చారు. అయితే స్కానింగ్ సెంటర్ సేవలు నిలిచిపోవడంతో ఇబ్బంది పడ్డారు. ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు నిరీక్షించారు. నిండు గర్భిణులు నొప్పులతో అవస్థలు పడుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. దాదాపు 4 గంటలకుపైగా పడిగాపులు గాసిన తర్వాత వచ్చిన డాక్టర్లు, స్కానింగ్‌కు సంబంధించిన సిబ్బంది లేరని చెప్పారు. ఇద్దరు కాంట్రాక్ట్ సిబ్బంది గడువు మార్చి 31తో ముగిసిందని, అందుకే రాలేదని తెలిపారు. ఆ తర్వాత గైనకాలజిస్ట్ వచ్చి కేవలం గర్భిణులకు మాత్రమే స్కానింగ్ పరీక్షలు చేశారు. మిగతా మహిళలు సర్కారు తీరుపై మండిపడుతూ వెనుదిరిగిపోయారు.

ప్రభుత్వానికి నివేదించాం
స్కానింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది కాంట్రాక్ట్ గడువు మార్చి నెలతో ముగిసింది. వారి స్థానంలో కొత్త సిబ్బందిని నియామకం లేదా కాంట్రాక్ట్ రెన్యూవల్‌ను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించాం. రాష్ట్ర వ్యాప్తంగా జీవో రావాల్సి ఉన్నది. ఇక్కడ కాంట్రాక్ట్ సిబ్బంది గడువు ముగియడంతో వారు వెళ్లిపోయారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు సిబ్బంది నియామకం జరుగుతుంది.
– ప్రవీణ్‌కుమార్, సూపరింటెండెంట్ (సిరిసిల్ల జిల్లా దవాఖాన)
పైసలు లేకనే ఈడికత్తిమి.. ప్రైవేట్‌కు పొమ్మంటే ఎట్ల?
నేను స్కానింగ్ పరీక్షల కోసం పొద్దుగాల 7 గంటలకే సిరిసిల్ల దవాఖానకు వచ్చిన. పదకొండు అయితున్నా ఇక్కడ స్కానింగ్ సెంటర్ డోర్ తీయలేదు. నాలుగు గంటలు అయినా ఎవరూ పట్టించుకోలేదు. సిబ్బందిని అడిగితే స్కానింగ్ పరీక్షలు చేసే డాక్టర్ రాలేదు. బయటకు వెళ్లి ప్రైవేట్‌లో చేయించుకోమని ఉచిత సలహా ఇచ్చిన్రు. మా దగ్గర పైసలు లేకనే గవర్నమెంట్ దవాఖానకు వస్తిమి. ఇప్పుడు ప్రైవేట్‌కు పోవాలంటే 2 వేలన్నా గావాలే. గవర్నమెంట్ దవాఖానలో పరీక్షలు చెయ్యకపోతే మాలాంటి గరీబోల్ల పరిస్థితి ఎట్ల?
– కర్నకంటి రేవతి, రేపాక (ఇల్లంతకుంట)
పొద్దుగాల సంది లైన్లో ఉన్న
మాది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి దగ్గర చొక్కాపూర్. నాకు తొమ్మిది నెలలు నిండినయి. స్కానింగ్ పరీక్ష చేసుకోమ్మని డాక్టర్ రాస్తే ఇక్కడికి వచ్చిన. పొద్దుగాల సంది లైన్లోనే ఉన్న. గర్భిణులతోపాటు ఇతర పరీక్షల కోసం వచ్చినోళ్లందరు ఇక్కడే ఉన్నరు. ముందు అడిగితే స్కానింగ్ డాక్టర్ వస్తడు. పరీక్షలు చేస్తడు అని చెప్పిన్రు. గంటలకొద్ది క్యూలైన్లో ఉంటే తీరా స్కానింగ్ పరీక్షలు చేయరని చెప్తున్నరు. అంతదూరం నుంచి వచ్చి గంటల కొద్ది లైన్ కడితే ఇప్పుడేమో డాక్టర్ లేడు.. పరీక్షలు చేయమని అంటున్నరు. ఈ టైంల మేమేక్కడ పరీక్షలు చేయించుకోవాలే. కనీసం ఇక్కడికి వచ్చి పట్టించుకునేటోళ్లు కూడా లేరు. అడిగితే సమాధానం కూడా చెపుతలేరు.
– ప్రియాంక, చొక్కాపూర్ (కామారెడ్డి జిల్లా)