పల్లెల్లో నీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు పంచాయతీల్లో తాగునీటి తండ్లాట మొదలైంది. ఇది మే నాటికి తీవ్రరూపం దాల్చే ముప్పు కనిపిస్తున్నది. ఓవైపు అడుగుంటిన భూగర్భజలాలు.. మరోవైపు ప్రాజెక్టుల్లో తగ్గిన నీటిమట్టాలు వెరసి తాగునీటి వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులను అధ్యయనం చేసి, చక్కదిద్దడంతోపాటు వేసవి ముందస్తు ప్లాన్ కింద నీటి ఎద్దడి నివారణకు నిధులు విడుదల చేయాల్సిన సర్కారు.. నయాపైసా ఇవ్వకుండా చోద్యం చూస్తున్నది. పద్నాలుగు నెలలుగా గ్రాంటులు నిలిచిపోగా, కనీసం బోర్లు మరమ్మతులు చేయించలేని పరిస్థితి ఏర్పడుతున్నది. ఇవేవీ పట్టన్నట్టు వ్యవహరిస్తున్న అధికారులు.. పనిచేస్తారా.. లేదా..? అంటూ ఒత్తిడి చేస్తుండడంతో కార్యదర్శులు తీవ్ర మానసిక క్షోభకు గురవువుతున్నారు. ఇప్పటికే తెచ్చిన అప్పులు చెల్లించలేకపోతున్నామని, భవిష్యత్ భారం ఎలా మోస్తామని ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లెలకు తాగునీటి ముప్పు పొంచి ఉన్నది. ఉమ్మడి జిల్లాలో 1214 పంచాయతీలుండగా, ఇప్పటికే పలు పంచాయతీల్లో తండ్లాట మొదలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక సోర్సులను ఏర్పాటు చేసి మిషన్ భగీరథ ద్వారా పుష్కలమైన నీటిని అందించింది. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా ఎక్కడికక్కడ భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. పల్లెలకు తాగునీరందించే బోర్లు వట్టిపోతున్నాయి. డిమాండ్ మేరకు సరఫరా చేయలేకపోతున్నాయి. అలాగే మంచినీటి సోర్సుల్లోనూ నీళ్లు సరిపడా లేక మోటర్ల ద్వారా నీరివ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లాలోని ప్రతి ప్రాజెక్టు, చెరువులు మండుటెండల్లోనూ నిండుకుండలుగా ఉండడంతో భూగర్భజలాలు పెరిగి.. తాగునీటికి తిప్పలు తిప్పాయి. ప్రస్తుతం చెరువులు ఎడారిని తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోనూ నీళ్లు కనీస నీటిమట్టానికి పడిపోయాయి. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు, ప్రాజెక్టుల నుంచి వరికి మరో తడి ఇస్తే తప్ప పంట చేతికి వచ్చేలా లేదు. ప్రస్తుతం ప్రారంభమైన నీటి కొరత వేసవి నాటికి తీవ్ర రూపం దాల్చే ప్రమాదం కనిపిస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలకు వివిధ రకాల గ్రాంటులు వచ్చేవి. 2011 జనాభా ప్రాతిపదికన ప్రతినెలా చిన్న చిన్న పంచాయతీలకు నెలకు 50వేలు, మధ్యరకం జీపీలకు సుమారు 5లక్షల నుంచి 10 లక్షలు, మేజర్ పంచాయతీలకు 15లక్షల నుంచి 25లక్షల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వచ్చేవి. ఇంకా నెలానెలా పల్లెప్రగతి కింద నిధులు జమయ్యేవి. రాష్ట్ర ప్రభుత్వం కూడా పల్లె ప్రగతికి ప్రత్యేక గ్రాంటు మంజూరు చేయడంతో పంచాయతీలు కళకళలాడాయి. ఈ నిధులు ఉండడం వల్ల ప్రతి పంచాయతీ నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకెళ్లేవి. కానీ, ప్రస్తుతం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 2019 జనవరి 21, 25, 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు వివిధ దశల్లో జరగ్గా.. 2024 ఫిబ్రవరి ఒకటితో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలనను అమల్లోకి వచ్చింది. నిబంధనల ప్రకారం సర్పంచ్ పదవీకాలం ముగిసిన ఆరునెలల్లోగా ఎన్నికలు జరగాలి. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని చూస్తే ఎప్పుడు జరుగుతాయో తెలియదు. ఎన్నికలు లేకపోవడం వల్ల కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం గ్రాంటును ఆపేసింది. ఇదే సమయంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కూడా నిధులు రావడం లేదు. దీంతో పంచాయతీల్లో ఖజనా ఖాళీగా దర్శనమిస్తున్నది. అంతేకాదు, స్థానికంగా వసూలు చేసే ఇంటిపన్ను తదితర ఆదాయానికి సంబంధించిన నిధులు డ్రా కావడం లేదు. గతేడాది జూన్ నుంచి అందుకు సంబంధించిన చెక్కులు పాస్‌కావడం లేదు. దాదాపు పద్నాలుగు నెలలుగా నిలిచిపోవడంతో ప్రతి పంచాయతీలోనూ రోజువారీ నిర్వహణే కష్టసాధ్యంగా మారింది.
పంచాయతీల్లో పైసా లేక రోజువారీ నిర్వహణ కష్టమవుతున్నదనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం అయ్యేలా చూడాలంటూ పంచాయతీ కార్యదర్శులు నిత్యం ఉన్నతాధికారులకు మొర పెట్టుకుంటున్నా పట్టించుకునే వారు లేరు. పైగా వాస్తవ పరిస్థితులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా రోజువారీ నిర్వహణతోపాటు పంచాయతీల్లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్య వంటివి లేకుండా చూడాలంటూ ఉన్నతాధికారులు హుకూం జారీచేస్తున్నారు. పంచాయతీ పనులకు అప్పులు తెచ్చి పెడుతున్నామంటూ చెప్పినా వినకుండా.. ‘చేస్తే చేయం డి. లేకుంటే మీ చావు మీరు చావండి’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కొంత మంది కార్యదర్శులకు చార్జీ మె మోలు జారీచేయడంతోపాటు సస్పెండ్ చేస్తున్నా రు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ భారం మోయలేక.. చిల్లిగవ్వలేని పంచాయతీలను ముందుకు నడుపలేక.. అప్పులు తెచ్చిపెట్టి ముందు కు తీసుకెళ్లే సామర్థ్యం లేక కార్యదర్శులు సతమతమవుతున్నారు.
నిజానికి పంచాయతీలకు తాగునీటి ఎద్దడి పొంచి ఉందని, ఇప్పటికే పలుచోట్ల ఆ పరిస్థితులు తలెత్తుతున్నాయని క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాస్తవ విషయాలపై సమీక్షా సమావేశం నిర్వహించి, నీటిఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు.. అవసరమైన నిధులకు సంబంధించిన అంచనాలు తయారు చేయాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఎక్కడైనా నీటి ఎద్దడి ఏర్పడితే.. తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా తెప్పించడానికి చిల్లగవ్వలేని పరిస్థితి పంచాయతీల్లో ఉన్నది. కనీసం బోరు చెడిపోయినా రిపేర్ చేయించలేని దుస్థితి ఉన్నది. నిజానికి మెజార్టీ పల్లెల్లో బోర్లు పనిచేయడం లేదు. వాటిని రిపేర్ చేయాలంటే కార్యదర్శులే జేబుల నుంచి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. డబ్బులు పెట్టినా బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియదు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం జిల్లాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి, పంచాయతీల్లో నీటి ఎద్దడి నివారణకు అవసరమయ్యే నిధులను ప్రత్యేక ఫండ్ నుంచి కేటాయించాలన్న డిమాండ్ వస్తున్నది. అందుకోసం యుద్ధప్రాతిపదిక ప్రణాళికలు చేస్తే తప్ప ప్రయోజనం ఉండదన్న వాదనలను పంచాయతీ సెక్రటరీలు చెబుతున్నారు.
పంచాయతీల్లో రోజువారీ అవసరాలకు సంబంధించి ప్రభుత్వం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం రోజువారీ ఖర్చులకు జేబు నుంచి పెట్టుకునే పరిస్థితి ఉన్నది. వసూలు చేసిన ఇంటిపన్ను లాంటి ఆదాయాలకు సంబంధించిన జనరేట్ చేసిన చెక్కులు ట్రెజరీల్లో పాస్ కావడం లేదు. జూన్ నుంచి చెక్కులు పాస్ కాకపోవడం వల్ల కార్యదర్శులం అనేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని ఒక్కటే వేడుకుంటున్నాం. తక్షణం మా సమస్యలను గుర్తించి రోజు వారీ నిర్వహణకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం. 2019 ఏప్రిల్ 12 నుంచి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ కాలాన్ని కలుపాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాం.
– జీ అజయ్‌కుమార్, కరీంనగర్ జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు