ధర్మారం/రామడుగు/బోయినపల్లి/ ఇల్లంతకుంట, ఆగస్టు 5: కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు ఎత్తిపోసి సాగునీరిచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. వర్షాభావ పరిస్థితులు, అడుగంటిన జలాశయాలు ఫలితంగా వానకాలం సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
ఈ క్రమంలో రైతుల గోసను మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను నింపి రైతులకు సాగునీరివ్వాలని ఆయన శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు.
దాంతో సాగునీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా స్పందించి, మిడ్‌మానేరు ద్వారా సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోస్తామని చెప్పారు. ఆ మేరకు సోమవారం ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ ప్రాజెక్టుకు ఎత్తిపోతలు ప్రారంభించారు. మధ్యమానేరు నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా తిప్పాపూర్‌లోని సర్జ్పూల్కు జలాలు చేరుతుండగా, ఇక్కడి పంప్‌హౌస్‌లో రెండు బహుబలి మోటర్లను సోమవారం ఆన్ చేశారు.
ఒక్కో మోటర్ ద్వారా 3,220 క్యూసెక్కుల చొప్పున 6,440 క్యూసెక్కులు అన్నఫూర్ణ జలాశయానికి తరలిస్తున్నట్టు ఏఈ సమరసేట తెలిపారు. కాగా, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి అన్నపూర్ణ జలాశయానికి విడుదల చేయాలని కోరిన మూడు రోజులకే ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయగా, రైతులు సంబురపడుతున్నారు.
కొనసాగుతున్న ఎత్తిపోతలు
ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు జలాశయానికి పరవళ్లు తొక్కిన గోదారి, సోమవారం అన్నపూర్ణ జలాశయం వైపు సాగింది. తిప్పాపూర్ పంప్‌హౌస్ నుంచి పంపింగ్ మొదలైంది. పది రోజులుగా కాళేశ్వరం లింక్-2లో ఎత్తిపోతలు కొ నసాగుతున్న విషయం తెలిసిందే. సోమవారం కూడా ధర్మా రం మండలం నంది మేడారంలోని నంది పంప్‌హౌస్‌లో నా లుగు మోటర్లు నడిపించారు. ఒక్కో మోటర్ ద్వారా 3,150 చొప్పున 12,600 క్యూసెక్కులు డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా ఎగిసి పడి నంది రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి.
ఇక్కడ 10 గేట్లను ఎత్తడంతో గ్రావిటీ కాల్వ ద్వారా జంట సొరంగాలకు చేరి అక్కడి నుంచి 7, 8 ప్యాకేజీలలోని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలిపోతున్నాయి. అక్కడి నుంచి సైతం నాలుగు మోటర్ల ద్వారా 12,600 క్యూసెక్కులు లిఫ్ట్ చేస్తుండగా, డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా ఎగిసి పడ్డ జలాలు సుమారు 5.7 కిలోమీటర్లు ఉన్న గ్రావిటీ కాలువ ద్వారా ప్రవహించి వరదకాలువలో 99వ కిలోమీటర్ మైలురాయి వద్ద కలుస్తున్నాయి.
అక్కడి నుంచి మధ్యమానేరుకు పరుగెడుతున్నాయి. సోమవారం వరకు సుమారు 10 టీఎంసీలకుపైగా గోదారి జలాలను మధ్యమానేరుకు తరలించినట్టు ప్రాజెక్టు డీఈఈ రాంప్రదీప్ తెలిపారు. కాగా, ఎత్తిపోతల ద్వారా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతున్న నేపథ్యంలో మధ్యమానేరులో నీటి మట్టం గంట గంటకు పెరుగుతున్నది. పూర్తి నీటి సామర్థ్యం 27.054 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 16.215 టీఎంసీలు ఉంది.