Nandi Pump House | ధర్మారం, ఆగస్టు 18: పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ధర్మారం మండలం నంది పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఈనెల 13 నుంచి ఇక్కడ ఎత్తిపోతల ప్రక్రియను నీటిపారుదల శాఖ చేపట్టారు. గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తో పాటు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నుంచి లక్షల క్యూసెక్కుల కొలది వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. కాగా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది పంప్ హౌస్ లో ఈ నెల 13 నుంచి 4 మోటార్ల ద్వారా ఆదివారం వరకు 5 రోజులపాటు 12,600 క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోశారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద భారీ ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నంది పంప్ హౌస్ లో సోమవారం 2,5 నెంబర్ల మోటార్లను నిలిపివేశారు. ప్రస్తుతం 4,6 నంబర్ల మోటార్లతో నీటి పంపింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో మోటార్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున నీరు డెలివరీ సిస్టర్న్ ల ద్వారా ఎగిసి పడుతూ నంది రిజర్వాయర్ లోకి చేరుతుంది.
ఆ తర్వాత నంది రిజర్వాయర్ నుంచి ప్రధాన గేట్లు ద్వారా విడుదలైన నీరు గ్రావిటీ కాల్వ ద్వారా వెళ్లి 2 అండర్ టన్నేళ్ళ ద్వారా ప్రవహించి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంపు హౌస్ లోకి చేరుకుంటుంది. అక్కడి పంపు హౌస్ లో 3 బాహుబలి మోటార్లను ఆన్ చేసి గోదావరి జలాలను వరద కాలువ లోకి వదిలి అక్కడ నుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నట్లు నీటిపారుదల శాఖ డీఈఈ గునిగంటి నర్సింగ్ రావు తెలిపారు.