GodavariKhani | కోల్ సిటీ, ఫిబ్రవరి 9 : ఆత్మరక్షణ విద్యలో గోదావరిఖని విద్యార్థులు సత్తా చాటారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అరుదైన విజయం సాధించారు. ఈ మేరకు హైదరాబాద్ లో ని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో న్యూ డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన 5వ అంతర్జాతీయ స్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీలలో దేశ విదేశాల నుంచి వందల సంఖ్యలో కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.
భారతదేశం తరపున 23 రాష్ట్రాల నుంచి 1200 మంది విద్యార్థులు పాల్గొనగా తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన హుయాన్ చుంగ్ కుంగ్ ఫూ మార్షల్ ఆర్ట్స్ నుంచి 20 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించి గోల్డ్ మెడల్స్ సాధించి రికార్డు సొంతం చేసుకున్నారు.
వీరిలో అండర్- 10 విభాగంలో శ్రీకరి వైదు (గోల్డ్ మెడల్, హార్దిక్ (గోల్డ్ మెడల్), యుగేందర్ (సిల్వర్), అండర్- 12 విభాగంలో ఏబీసీ గ్రూపులో జీ.హర్షవర్ధన్ (గోల్డ్ మెడల్), సంజీవ్ (సిల్వర్), ఎండీ గౌస్ (గోల్డ్ మెడల్), వై. తేజశ్రీ (గోల్డ్ మెడల్) సాధించినట్లు కోచ్ ఎం.రాజేశం తెలిపారు. అలాగే రెఫరీలుగా జీ.నారాయణ, కే.రాములు, ఎండీ సజీత్ వ్యవహరించారు. అంతర్జాతీయ స్థాయిలో అరుదైన రికార్డు సాధించిన విద్యార్థులను కరాటే మాస్టర్ తో పాటు పోషకులు ప్రత్యేకంగా అభినందించి హర్షం వ్యక్తం చేశారు. కోచ్, కరాటే మాస్టర్ ఎం. రాజేష్ తమ శిక్షణలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి అరుదైన రికార్డు సాధించడం చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు.