Madhu | కోల్ సిటీ, సెప్టెంబర్ 1: గోదావరిఖని అంటేనే దక్షిణ భారతానికి కొంగు బంగారం.. కల్పతరువు అనీ, నల్లబంగారం బయటకు తీసి ప్రపంచంకు దివిటీలుగా ఇక్కడి ప్రజలు నిలిచారనీ, చిన్నప్పుడు నేనూ ఇక్కడే కాలి నడకన తిరిగే వాడినని , ఇక్కడి వాతావరణం అంటే ఎంతో ఇష్టమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తన బాల్య స్మృతులను గుర్తు చేశారు. గోదావరిఖని జవహర్ నగర్ లో గల భారత్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు పుట్ట మధు శైలజ దంపతులు ముఖ్య అతిథిగా హాజరై గణనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తాను చిన్నప్పుడు ఇదే గడ్డపై తిరిగాననీ, అప్పట్లో గోదావరిఖని అంటే ఎంతో పేరుపోయిందని చెప్పుకొచ్చారు. ఉద్యమాలకే కాదు.. ప్రేమ అప్యాయతలకు కూడా గోదావరిఖని ప్రజలు ముందు వరుసలోనే ఉంటారన్నారు. సింగరేణి బొగ్గు నిక్షేపాలు ఎన్టీపీసీ వెలుగులతో దక్షిణ భారత దేశానికి కొంగు బంగారంగా నిలిచిందన్నారు. భారీ పరిశ్రమలకు నిలయమన్నారు. సింగరేణి ప్రమాదంలో ఉన్నప్పుడు కేసీఆరే మళ్లీ పురుడు పోశాడన్నారు.
ఇప్పుడు సింగరేణి నౌకరి వెలకట్టలేనిది అయ్యిందన్నారు. కానీ, ప్రస్తుతం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత ప్రజలు కాలుష్య కోరల మధ్య నలిగిపోతుండటం ఎంతో బాధాకరంగా ఉందన్నారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే రామగుండమే కాదు రాష్ట్రం మొత్తం బాగు పడుతుందన్నారు. ఆ కాలం దగ్గరలోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ బాధ్యులు బోయిని అశోక్ యాదవ్, తిరుపతి, మొగిలి, రాజ్ కుమార్, జక్కుల సతీష్, కార్తీక్, మహేష్, హరీష్, కట్కూరి విష్ణువర్ధన్ తోపాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.