Godavarikhani | కోల్ సిటీ , జనవరి 20 : గోదావరిఖని మేకల మండికి మంగళవారం సాయంత్రం జనం దండిగా తరలివచ్చారు. మేకల ధరలు చూసి బెంబేలెత్తిపోయారు. మేడారం సమ్మక్క జాతరకు వెళ్లేముందు ఇంటి వద్ద సమ్మక్కలకు మేకలతో మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. బుధవారం సమ్మక్కలకు మంచి రోజు కావడంతో ఒకరోజు ముందుగానే మంగళవారం సాయంత్రం గోదావరిఖని కళ్యాణ్ నగర్ లో గల మేకల మండికి ఒక్కసారిగా జనం పోటెత్తారు. ఒక్కో మేక రూ.10 నుంచి రూ.20 వేల వేల పైచిలుకు ధర పలకడంతో అవాక్కయ్యారు.
మార్కెట్లో సమ్మక్కల పండుగ సందడి ఆశ్చర్యపరిచింది. దసరా పండుగ మినహా సాధారణంగా కనిపించే గోదావరిఖని మేకల మార్కెట్ మంగళవారం అనూహ్యంగా వేలాది సంఖ్యలో మేకల కొనుగోళ్లకు రావడంతో మండి ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. వన దేవతలకు మొక్కుల కోసం భారీగా జనం తరలిరావడంతో ఇదే అదనుగా మండి వ్యాపారులు చెప్పిన ధరల నుంచి ఏమాత్రం తగ్గేదేలే అన్న రీతిలో వ్యవహరించారు. ఒక్కో మేకకు రూ.10వేల పైచిలుకు ధర చెప్పడంతో బేరసారాలు ఆడి కొనుగోలు చేసి తీసుకవెళ్లడం కనిపించింది. ఈ దృశ్యాలను ‘నమస్తే” క్లిక్ మనిపించింది.