Singareni | పెద్దపల్లి, జూన్ 13( నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబాలు సింగరేణి ఏరియా ఆసుపత్రి, డిస్పెన్సరీలో సరిపడా మందులు లేక పడుతున్న ఇబ్బందులపై ఇటు సింగరేణి యాజమాన్యం, అటు కార్మిక సంఘాలు కదిలాయి. సింగరేణిలో మందుల కొరత..పై ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం కథనం ప్రచురించింది.
ఈ కథనం సింగరేణిని ఒక కుదుపు కుదిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి విస్తరించి ఉన్న భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని 24భూగర్భ గనులు, 18ఉపరితల గనులు మొత్తంగా 42గనుల్లో దాదాపుగా 40వేల మంది వరకు ఉద్యోగులు, సిబ్బంది, మరో 25వేల మంది కాంట్రాక్టు కార్మికులు, పదవీ విరమణ పొందిన దాదాపుగా 1,60,000ల మందికి సంబంధించిన మరో 4లక్షల వరకు ప్రజలు సింగరేణిలో మెడిసిన్ సరిగా లేక పడుతున్న బాధలను ఏకరువు పెట్టడంతో ఒక్కసారిగా యాజమాన్యం అప్రమత్తమయ్యింది.
ఏవైతే అందుబాటులో లేని మందులు ఉన్నాయో వాటిని వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చింది. దానికి తోడు ఆర్జీ-1 జీఎం లలిత్‌కుమార్ సైతం వెంటనే స్పందించి గోదావరిఖని ఏరియా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో మందుల స్టోరేజ్ యొక్క స్థితి మరియు పేషెంట్ లకు అందిస్తున్న మందుల యొక్క వివరాలను నేరుగా ఫార్మసి కౌంటర్ వద్ద ఉద్యోగులను, మందులు అందుకుంటున్న కార్మికులు, కార్మికుల కుటుంబాలను అడిగి నేరుగా తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా జీఎం లలిత్‌కుమార్ మాట్లాడుతూ.. ఆర్జీ-1పరిధిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ ప్రతిరోజు ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తుందన్నారు. దాదాపుగా ఏరియా హాస్పిటల్, డిస్పెన్సరీలు కలుపుకొని 2500 మందికి ఓపి సేవలు అందించబడుతున్నాయన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఏరియా హాస్పిటల్ లో వైద్య సేవలు, కార్పొరేట్ హాస్పిటల్స్ లో రిఫరల్ పంపించి కంపెనీ యాజమాన్యం అన్ని విధాలా చర్యలు చేపడుతున్నదన్నారు.
ఉద్యోగులకు 700 రకాల మందులు ఏరియా హాస్పిటల్లో అందుబాటులో ప్రతీ సంవత్సరం ఉంటాయన్నారు. ఏప్రిల్ 2025 నుండి ఈ గత రెండు నెలల్లో దాదాపుగా రూ.15 లక్షల ఖర్చు పెట్టి మన దగ్గర అందుబాటులో లేని మందులు కూడా లోకల్ పర్చేస్ ద్వారా తెప్పించి ఉద్యోగులకు మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోబడ్డాయన్నారు.
ప్రస్తుతానికి 700 రకాల మందులలో 525 రకాల మందులు మన ఏరియా హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయన్నారు. మిగతా 175 రకాల మందులు ఈ నెల ఆఖరుకు అందుబాటులోకి వచ్చేస్తాయన్నారు. గడిచిన ఆరు నెలలలో రామగుండం ఏరియా హాస్పిటల్ లో దాదాపుగా కోటి 50 లక్షలు వ్యయంతో మందులు ఉద్యోగులకు సరఫరా చేయబడ్డాయన్నారు. ప్రతీ రెండు సంవత్సరాలకు టెండర్ల ప్రక్రియ ద్వారా మందుల కంపెనీలు మారుతుంటాయని, కాబట్టి ఉద్యోగి కి అవసరం ఉన్న మందులు అదే మెడిసిన్ కానీ, వేరే వేరే కంపెనీలో ఇవ్వడం జరుగుతుందన్నారు.
మందులకోసం హాస్పటల్‌కు వచ్చే ఉద్యోగులు, పేషెంట్లు ఎలాంటి అపోహలకు పోవద్దని సింగరేణి కంపెని ఎల్లప్పుడూ ఉద్యోగుల సంక్షేమం కోసం పాటు పడుతుందన్నారు. కార్మికుల కోసం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలని చేపడుతుందని ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని అన్నారు. ఇట్టి విషయమై ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కంపెనీకి సహకరించాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డీవైసీఎంఓ డాక్టర్ అంబికను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, ఏరియా హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.
కదిలిన కార్మిక సంఘాలు
సింగరేణిలో మందుల కొరత అనే వార్తా కథనానికి సింగరేణిలోని కార్మిక సంఘాలు సైతం కదిలాయి. వెంటనే ఆసుపత్రుల్లో డిస్పెన్సరీల్లో మందులను అందుబాటులో ఉంచాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో గోదావరిఖని ఏరియా ఆసుపత్రి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం ఆసుపత్రి డీవైసీఎంఓ అంభికకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కార్మికులకు అన్ని రకాల మందులను అందజేయాలన్నారు. అదే విధంగా ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య సైతం స్పందించి కార్మికులకు, కార్మిక కుటుంబాలకు ఆసుపత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సింగరేణి ఆసుపత్రుల్లో అసౌకర్యాలను దూరం చేసి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు.