Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 2: మరణించినా జీవించాలంటే… ప్రతీ ఒక్కరూ అవయవదానంకు ముందుకు రావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ అన్నారు. ఈమేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో జాతీయ అవయవదాన దినోత్సవం పురస్కరించుకొని శనివారం మెప్మా సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సైతం ఏడాదిలో మూడుసార్లు రక్తదానం చేయవచ్చనీ, తద్వారా మరింత ఆరోగ్యవంతులు అవుతారన్నారు.
సదాశయ ఫౌండేషన్ సభ్యులు నేత్ర, శరీర, ఆవయవ దానంపై ప్రజల్లో చైతన్యం తీసుకవస్తూ ఇప్పటికే ఎంతో మందిచే నేత్ర, అవయవ దానాలు చేయించడం అభినందనీయమన్నారు. అదే స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ మరణానంతరం శరీర దానం చేయడం వల్ల వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. అలాగే అవయవాలు లేని ఎంతోమందికి పునర్జన్మ ప్రసాదించవచ్చన్నారు. ఇదే విషయమై మెప్మా సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.
మెప్మా సీఓ శమంతకమణి భర్త అనారోగ్యంతో చనిపోతే అతని అవయవాలు దానం చేయడం వల్ల 8 మందికి పునర్జన్మ ప్రసాదించారనీ, మున్సిపల్ డ్రైవర్ విజయ్ తన తండ్రి మరణానంతరం అంత్యక్రియల వరకు తీసుకవెళ్లి అక్కడే ఆలోచించి అప్పటికప్పుడే నేత్రాలను దానం చేసి మరో ఇద్దరి అంధులకు కంటి చూపు ప్రసాదించి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. అనంతరం వీరిని శాలువాతో ఘనంగా సన్మానించారు.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డా. అన్న ప్రసన్నకుమారి మాట్లాడుతూ ఏది ఆశించకుండా చేసేది దానమనీ, మహిళలు సైతం రక్తదానం, నేత్ర, అవయవ దానంకు ముందుకు రావల్సిన ఆవశ్యకత ఉందని కోరారు. అనంతరం తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. వారం రోజుల పాటు తల్లి పాల ఆవశ్యకతపై మెప్మా సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. సదాశయ ఫౌండేషన్ సమన్వయంతో జరిగిన కార్యక్రమంలో మెడికల్ కళాశాల సీఎంఓ రాజు, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు లింగమూర్తి, కేఎస్ వాసు, మెప్మా టీఎంసీ మౌనిక తోపాటు అధిక సంఖ్యలో ఆర్పీలు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు