వేములవాడ, సెప్టెంబర్ 25: దేవాదాయశాఖ ఉద్యోగులకు ఇప్పటికే నాలుగు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయని.. కనీసం మూడింటిని ఈ పండుగలోగా విడుదల చేయాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, 261జీవోను సవరించి ఉద్యోగులందరినీ ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి న్యాయం చేయాలని కోరారు. వేములవాడ పట్టణంలోని హోటల్ ఎస్ఆర్ఆర్ గ్రాండ్లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల ఉద్యోగుల జేఏసీ సమావేశం బుధవారం నిర్వహించగా, ఆయన హాజరై మాట్లాడారు. దేవాదాయ శాఖలో 1975 నాటి క్యాడర్ స్ట్రెంత్నే ఇప్పటికీ అమలు చేస్తున్నారన్నారు. ఆలయాల్లో భక్తుల రద్దీ, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఐదేండ్లకోసారి క్యాడర్ స్ట్రెంత్‌ను రివైజ్ చేయాలన్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. 317జీవో తీసుకువచ్చి జోనల్ వ్యవస్థలో బదిలీచేసి ఇబ్బందులకు గురి చేశారన్నారు. కనీసం స్పౌజ్‌ను కూడా పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామని చెప్పారు. ఇటీవల తాము 130కోట్లు వరద బాధితులకు సాయంగా అందించామని గుర్తుచేశారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, కొండగట్టు, కొమరవెల్లి, బాసర ఆలయాలకు చెందిన దాదాపు 200మంది ఉద్యోగులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రమేశ్‌బాబు, కో చైర్మన్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్, టీఎన్జీవో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట జిల్లాల టీఎన్జీవో అధ్యక్షులు ఎల్సాని ప్రవీణ్, దారం శ్రీనివాస్‌రెడ్డి, మిరియాల నాగేందర్‌రెడ్డి, పరమేశ్వర్, పలు ఆలయాల ఉద్యోగులు పాల్గొన్నారు.