Heart attack | ఎల్లారెడ్డిపేట, జూలై 5: మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక బ్రెయిన్‌స్ట్రోక్‌తో పాటు గుండెపోటుతో మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన విశ్వనాథుల పూర్ణ చందర్-కవిత దంపతుల ఒక్కగాక్క కూతురు సాత్విక(16) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. రెండు రోజుల క్రితం తలప్పిగా ఉందని ఇంటికి తీసుకొచ్చారు. తల నొప్పే కదా అని కంటి డాక్టర్‌కు చూపించి కళ్లద్దాలిప్పిద్దామనుకున్నారు.
అయినప్పటికీ తగ్గక పోవడంతో తలప్పి టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గకపోయే సరికి హాస్పిటల్‌కు తీసుకెల్దామని అనుకున్న తరుణంలో శనివారం స్పృహతప్పి కిందపడి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయించగా మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించి ఆపరేషన్‌కు సిద్ధం చేశారు. థియేటర్‌కు తీసుకెళ్తున్న క్రమంలో గుండెపోటు రావడంతో బాలిక మృతి చెందినట్లు గుర్తించారు.
ఇది వరకే బాలిక తండ్రి పక్షవాతంతో బాధపడుతుండగా, కుటుంబ పోషణకు బాలిక తల్లి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నప్పటికీ మంచి చదువుల కోసం కూతురును ఓ కార్పోరేట్ కళాశాలలో చేర్పించింది. ఒక్కగానొక్క కూతురే సర్వస్వం అనుకున్న వారి కండ్ల ముందే కూతురు మృతి చెందడంతో మృతురాలి తల్లిదండ్రుల రోదనలు చూసి పలువురు కంటతడి పెట్టారు.