కరీంనగర్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : కార్మికలోకం కదం తొక్కింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కన్నెర్ర జేసింది. శ్రామికుల హక్కులకు గొడ్డలిపెట్టుగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్‌తో బుధవారం దేశ వ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సక్సెస్ చేసింది.
కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో బీఆర్టీయూ సహా అన్ని ట్రేడ్ యూనియన్లు, బ్యాంకింగ్ ఉద్యోగుల ఫెడరేషన్స్, కార్మిక సంఘాల జేఏసీలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీసి, ధర్నాలతో హోరెత్తించింది. రైస్, సీడ్ మిల్ ఇండస్ట్రీస్, బీమా, బ్యాంకింగ్, మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులు, మెడికల్ అండ్ హెల్త్, స్కీమ్స్ వర్కర్లు, ఆశా, అంగన్వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మెడికల్ రిప్లు, లారీ డ్రైవర్లు, గూడ్స్ ట్రాలీ డ్రైవర్లు, బేవరేజ్ హమాలీ యూనియన్, రైల్వే లోడింగ్, అన్లోడింగ్ హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు హాజరై, బీజేపీ సర్కారు తీరును ఎండగట్టారు.
అటు సింగరేణిలోనూ నల్లసూరీలు భగ్గుమన్నారు. రామగుండం రీజియన్ పరిధిలోని నాలుగు ఓసీపీలు, ఆరు గనుల్లో బొగ్గు ఉత్పత్తిని స్తంభింపజేశారు. కేంద్రం దిగిరావాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. సింగరేణి కార్మికులతో పాటుగా సంఘటిత, అసంఘటిత కార్మికులు సైతం ఈ సమ్మెకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.