General strike | ధర్మారం, జూన్ 22 : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ మండల కమిటీ సమావేశం ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఆకుల రాజయ్య అధ్యక్షతన జరిగింది. అనంతరం జులై 9 న దేశ వ్యాప్త సమ్మె కరపత్రాలు ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీపెల్లి రవీందర్ ఆధ్వర్యంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని, లేబర్ కోడ్ల రద్దుతో పాటు ఇతర డిమాండ్ల సాధనకై జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలో పంచాయతీ కార్మికులు మల్టీ పర్పస్ వర్కర్ విధానంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, నైపుణ్యం లేని పనులు చేయడం వల్ల అనేకమంది అనారోగ్యంతో మరణిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జిపి కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ఆదివారం, పండుగ సెలవులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని,మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని రవీందర్ డిమాండ్ చేశారు. ఈనెల 27న జరిగే చలో హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఖాజా, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల రాజయ్య, రవి, గొల్లపల్లి రమేష్, వెంకటేష్, భాస్కర్, రమేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.