Dongatturthi | ధర్మారం, మే 10: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో శనివారం తాటి చెట్టు పై నుంచి పడి పంతంగి శ్రీనివాస్ గౌడ్ అనే గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ సాయంత్రం సమయంలో గ్రామ శివారులో కల్లు గీయడానికి తాటిచెట్టు ఎక్కాడు. తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు మోకుజారి కిందపడ్డాడు.
దీంతో శ్రీనివాసగౌడ్ నడుముకు, శరీర ఇతర భాగాలకు రక్త గాయాలైనట్లు గీత కార్మికులు తెలిపారు. శ్రీనివాస గౌడ్ ప్రమాదానికి గురి కావడంతో అక్కడే ఉన్న చోటు గీత కార్మికులు హుటాహుటిన అతనిని చికిత్స కోసం పెద్దపల్లిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. శ్రీనివాస్ గౌడ్ కు మెరుగైన చికిత్స అందించి ఆయనకు ప్రభుత్వం మార్గ సహాయం అందించాలని గ్రామ గీత కార్మిక సంఘం నాయకుడు బాలసాని తిరుపతి గౌడ్ కోరారు.