కరీంనగర్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తామని, నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు అభిషేక్ మొహంతి పూలమొక్క అందించారు. అనంతరం ఇద్దరు అధికారులు కాసేపు మాట్లాడుకున్నారు.
తర్వాత కమిషనరేట్ పరిధిలోని నేరాలు, శాంతిభద్రతల గురించి అభిషేక్ మొహంతిని సీపీ గౌష్ ఆలం అడిగి తెలుసుకున్నారు. నూతన సీపీకి సాయుధ బలగాలు గౌరవవందనం సమర్పించగా, కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, శాంతి భద్రతలు, రోడ్డు భద్రత, పట్టణ పోలీసింగ్‌పై దృష్టిసారిస్తామని, పౌర ఆధారిత పోలీసింగ్ సేవలు పెంచుతామని చెప్పారు. పోలీసింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం నిరంతరం కట్టుబడి ఉంటానని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ ఏ లక్ష్మీనారాయణ, రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, ప్రొహిబేషనరీ ఐపీఎస్ వసుంధరయాదవ్, కమిషనరేట్‌లోని ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.