కార్పొరేషన్, అక్టోబర్ 22: మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల నర్సమ్మ (85) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని నివాసంలో మంగళవారం ఉదయం మృతి చెందారు. కాగా, ఆమె భౌతికకాయానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ శ్రేణులు నివాళులర్పించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
ప్రస్తుతం గంగుల కమలాకర్ విదేశాల్లో ఉండడంతో బుధవారం ఉదయం 9.30 గంటలకు స్థానిక మార్కండేయనగర్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, గంగుల కమలాకర్ మాతృమూర్తి మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు వేర్వేరు ప్రకటనల్లో ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.