కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 28: బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకులకు వణుకు పుట్టిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. మంత్రులు బెంబేలెత్తిపోయి, గజగజ వణికిపోయి సభ ఫెయిల్ అయ్యిందంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎల్కతుర్తికి వచ్చి ఉంటే వారికి సభ ఎంత పెద్దగా జరిగిందో తెలిసేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నాయకులు, మంత్రులకు దమ్ముంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో సగం మందితోనైనా సభ నిర్వహించగలరా..? అని సవాల్ చేశారు.
కరీంనగర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఆదివారం ఉదయం సభకు స్కూల్ బస్సులు పంపితే రూ.లక్ష జరిమానా విధిస్తామని రవాణాశాఖ నుంచి మెసేజ్‌లు పెట్టించారన్నారు. ప్రభుత్వం బెదిరించినా.. అనేక సంస్థలు బస్సులను పంపించాయన్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన రవాణాశాఖ మంత్రికి సిగ్గుండాలన్నారు. సభకు వచ్చే వాహనాలను సైతం ఏ కారణం లేకుండానే ఆపివేశారని, ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ఎందుకని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో కూడా సమావేశాలు పెట్టే పరిస్థితి లేదన్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో మంత్రులు ఎందుకు సమావేశాలు పెట్టడంలేదని నిలదీశారు. బీఆర్ఎస్ సభలో తొలి సీఎం కేసీఆర్ ప్రసంగం పూర్తయ్యేంత వరకు ఒక్కరూ కూడా బయటకు పోలేదంటే తమకు ప్రజలు మద్దతు ఏవిధంగా ఉన్నదో తెలిసిపోతుందన్నారు. దేశ చరిత్రలోనే ఓ ప్రాంతీయ పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత పెద్ద సభ ఏర్పాటు చేయడం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైందన్నారు.
రజతోత్సవ సభకు 95 శాతం యువత, రైతాంగమే వచ్చిందన్నారు. బీఆర్ఎస్పై ప్రేమతో తామంతా అండగా ఉన్నామని చెప్పినట్టు సంఘీభావం తెలుపుతూ తరలివచ్చారన్నారు. బీఆర్ఎస్ సభ కాగానే, పీడకల వచ్చినట్లు ఉలిక్కిపడిన మంత్రులు మీడియా ముందకొచ్చి ఇష్టంవచ్చినట్లు కూతలు కూశారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు, రాష్ట్రం ఏర్పాటైన అప్పుడు పొంగులేటి వైసీపీలో ఉన్నారని, సీతక్క టీడీపీలో ఉన్నారని గుర్తు చేశారు. వీరికి ఉద్యమంతో గానీ, రాష్ట్ర ఏర్పాటుతో గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
రాష్ర్టాన్ని కాంగ్రెస్ స్వచ్ఛందంగా ఇవ్వలేదని, ఆ పార్టీ మెడలు వంచి తెచ్చుకున్నామని తెలిపారు. కేసీఆర్ చేసిన ఉద్యమంతో రాష్ట్రం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందే తప్పా.. మరొకటి కాదన్నారు. ఇచ్చే వారయితే 60ఏండ్లు ఎందుకు గోస పెట్టించుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీకే ఘనత దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు ఎప్పటికి మద్దతుగా ఉండేది బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. సభ విజయవంతం కావడంతో మంత్రులు ఉలిక్కిపాటుకు గురవుతున్నారని మండిపడ్డారు.
మీఫేల్యూర్ మొదలైందని, ఇప్పటికైనా అలర్ట్ అయ్యి వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సభను విజయవంతం కోసం ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనిల్, మాజీ కార్పొరేటర్ బండారి వేణు, నాయకుడు సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఓర్వలేకనే మంత్రుల అక్కసు
బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఒక పండుగ వాతవరణంలో విజయవంతంగా సాగింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కనిపించేలా తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. రజతోత్సవ వేడుకలు అన్ని పల్లెల్లోనూ పండుగ వాతవరణంలో జరిగాయి. ఇది ఓర్వలేకే మంత్రులు తమ అక్కసును వెల్లగక్కుతున్నారు. ఏడాదిన్నరలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రజలు అడుగుతున్నవే సభలోనే కేసీఆర్ అడిగారని.. అందులో మంత్రులకు ఏం తప్పు కనిపించిందో చెప్పాలి. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ మొదటి నుంచి విలన్‌గానే ఉన్నది.
రాష్ట్రం కోసం ఆనాడు అనేక ఉద్యమాలు, బలిదానాలు జరిగితే తప్పనిసరి పరిస్థితిల్లో తెలంగాణ ఇచ్చారు. ముందు ఇస్తే ఈ బలిదానాలు జరిగేవి కాదు కదా! తెలంగాణ తామే ఇచ్చామని పదేపదే కాంగ్రెస్ నాయకులు చెబుతుంటే ఆశ్చర్యం వేస్తున్నది. కేసీఆర్ ఉద్యమం చేసి ఉండకపోతే తెలంగాణ వచ్చేదా..? కాంగ్రెస్ ఎన్నికల్లో అనేక అబద్ధపు హామీలు ఇచ్చింది. కేసీఆర్‌ను నిదించడం తప్ప హామీలు అమలు చేయాలన్న ఆలోచన మంత్రుల్లో లేదు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే గొప్పగా ఎదిగింది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అధోగతికి వచ్చింది. ఇప్పటికీ కూడా ఇచ్చిన హమీలను అమలుచేయకుండా.. అబద్ధాలతోనే కొనసాగుతామనుకోవడం సిగుచేటు. ఇప్పటికైనా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి