కొత్తపల్లి, జూన్ 28 : బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కళకళలాడిన తెలంగాణ ప్రాంతం, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కరువుకు నిలయంగా మారుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. నాడు పుష్కలంగా నీరందించిన వరదకాలువ నేడు వట్టిపోయే స్థితికి చేరిందని, కరీంనగర్ నియోజకవర్గంలో సాగు చేయలేని పరిస్థితి ఉందని వాపోయారు. రాష్ట్ర సర్కారు ఇప్పటికైనా స్పందించాలని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వరదకాలువను నింపి సాగునీరివ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు రైతు మహాపాదయాత్ర చేసి, పంప్‌లను ఆన్ చేస్తామని హెచ్చరించారు. కొత్తపల్లి మండలంలోని ఏడు గ్రామాల ప్రజలకు సాగునీరందించాలనే డిమాండ్‌తో గంగాధర మండలం ఆచంపల్లి వరదకాలువ తూము వద్ద రైతులు, నాయకులతో కలిసి మహాధర్నా చేశారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కేంద్రంగా పాలన సాగించారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు ఇచ్చారని గుర్తు చేశారు. నేడు మేడిగడ్డ నుంచి సాగునీరందించే అవకాశం ఉన్నా బీఆర్ఎస్పై ఉన్న అక్కసుతో పట్టించుకోవడం లేదని, కుంగిన మూడు పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా రైతులకు ఇబ్బందులకు చేస్తున్నదని మండిపడ్డారు. వరద కాలువ ద్వారా సాగునీరందక మూడేళ్లుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. రోహిణి కార్తె ముగిసి నెలకావస్తున్నా నార్లు పోసుకోలేదని, మరో పది రోజులు ఉంటే సాగుచేసినా లాభం ఉండదని వాపోయారు. రేవంత్‌రెడ్డి రైతుల బాధల పట్టించుకోవడం లేదని, గోదావరి ద్వారా ప్రతిరోజూ 10 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్న వరదకాలువకు మళ్లించే ప్రయత్నాలు చేయడం లేదని మండిపడ్డారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, రైతులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ వరకు మహారైతు పాదయాత్ర చేసి, మోటర్లు ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనిల్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, సర్పంచులు తాండ్ర శ్రీనివాస్, పెంచాల ఆంజనేయులు, నాయకులు పిల్లి మహేశ్ గౌడ్, లక్కాకుల మోహన్‌రావు, చల్ల హరిశంకర్, కాసారపు శ్రీనివాస్‌గౌడ్, రుద్ర రాజు, సుంకిసాల సంపత్‌రావు, శ్యాసుందర్‌రెడ్డి, పెరక లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సాగునీటి కోసం మా నిరసనను ఇప్పటికే ప్రభుత్వానికి తెలిపినం. అయినా రైతుల గురించి ఆలోచించే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తలేడు. మూడేళ్లుగా ఇబ్బందులు పడుతన్నం. ఇక ఆందోళనలు, ఉద్యమాలు తప్ప మాకు వేరే దిక్కు కనపడుత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వరద కాలువ ద్వారా కొత్తపల్లి మండలంలోని గ్రామాలకు సాగునీరు ఇవ్వకుంటే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో రైతులంతా కలిసి మేడిగడ్డ వరకు పాదయాత్ర చేస్తం. అక్కడ మోటర్లను ఆన్ చేస్తం. నీటిని విడుదల చేస్తం.
– రెడ్డవేని మధు, ఏఎంసీ మాజీ చైర్మన్