కార్పొరేషన్, మార్చి 31 : నగర ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తెకుండా చూడాలని, వారంలోగా ఎల్ఎండీ ప్రాజెక్టులో 13టీఎంసీల నీరు నిల్వ చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.7టీఎంసీల నీరు మాత్రమే ఉందని, అందులో 2.5 టీఎంసీలు డెడ్ స్టోరేజీగా ఉంటుందని చెప్పారు. ఉన్న 3టీఎంసీలతో నగరానికి వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడడం అసాధ్యమేనని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎల్ఎండీ డెడ్ స్టోరేజీకి పడిపోతున్న విషయం తెలుసుకుని సోమవారం ఆయన జలాశయాన్ని పరిశీలించి, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తాగునీటి కోసం యుద్ధాలు చేసిన పరిస్థితులు ఉన్నాయని, తానే ఎమ్మెల్యేగా 2012లో నగర తాగునీటి కోసం పోరాటం చేసి, కిందికి నీరు విడుదల చేయకుండా ఇసుక బస్తాలు వేసి అడ్డుకున్నామని గుర్తు చేశారు. కానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ పాలనలో తాగునీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితి ఎప్పుడు రాలేదన్నారు.
కరీంనగరంలో రోజు తప్పించి రోజు ఇచ్చే పరిస్థితి నుంచి ప్రతిరోజూ నీరు అందించే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే ఎల్ఎండీలో ఎట్టి పరిస్థితుల్లోనూ 13టీఎంసీలకు తగ్గకుండా నీటిమట్టం ఉండాలని 2017అక్టోబర్ 30న జీవో నంబర్ 885ను జారీ చేశామన్నారు. ఎల్ఎండీలో ఇప్పుడు 5.70 టీఎంసీ నీరు మాత్రమే ఉందని, అందులో 2.5టీఎంసీ డెడ్ స్టోరేజ్ అని పేరొన్నారు. ఇక మిగిలింది మూడు టీఎంసీల నీరేనని.. దాని ద్వారా తాగు, సాగునీటి అవసరాలను ఎలా తీర్చుతారో ప్రజలకు చెప్పాలన్నారు. ఎల్ంఎడీ నుంచి కిందికి నీటిని విడుదల చేసే గడువు నేటితో ముగియాల్సి ఉన్నా.. ఇరిగేషన్ అధికారులు మరో మూడు రోజులు పొడిగించడంతో నీటిమట్టం మరింత పడిపోతుందన్నారు. ఇరిగేషన్ అధికారులు ఎల్ఎండీలో నీటిమట్టం తగ్గిపోతుందని, నగరానికి సంబంధించి నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని నగరపాలక అధికారులకు లేఖ రాశారని పేర్కొన్నారు. ఇప్పుడు నగరపాలక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. గత నెల రోజులుగా నగరంలోని అనేక ప్రాంతాల్లో రోజు నీటి సరఫరాను బంద్ చేసి రోజు తప్పించే రోజు నీటి సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే బూస్టర్ పంపులను ఆన్ చేసి నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎల్ఎండీలో ఉన్న మూడు టీఎంసీల నీటితో వచ్చే మూడున్నర నెలల పాటు నగరానికి ఎలా ఇబ్బందులు లేకుండా మంచినీటి సరఫరా అందిస్తారని నిలదీశారు. ఎండలు పెరిగే కొద్ది నీరు ఆవిరి అవుతుందని, దీంతో నీటిమట్టం మరింత తగ్గుతుందన్నారు.
మధ్యమానేరులో 9, ఎల్లంపల్లిలో 9, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 16టీఎంసీలు నీరు ఉందని, ప్రభుత్వం వెంటనే కళ్లు తెరిచి నగరపాలకసంస్థ పరిధిలో తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కరీంనగర్ నియోజకవర్గంలో సాగునీరు అందించలేక పొలాలను ఎండబెట్టారని.. తాగునీరు లేక ప్రజల్ని ఎండబెట్టవద్దన్నారు. మార్చి 31 నాటికే తాగునీటి పరిస్థితి ఇలా ఉంటే.. రానున్న వేసవిలో ఇంకా ఎలాంటి ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న నీటితో నగరానికి పూర్తి స్థాయిలో తాగునీరు అందించలేరని విమర్శించారు. మరో వారం గడువు మాత్రమే ఇస్తామని, వెంటనే ఎల్ఎండీలో నీటిమట్టాన్ని పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మధ్యమానేరు నుంచి వస్తున్న 2,500 క్యూస్కెక్యుల నీరు ఏ మాత్రం సరిపోదన్నారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఎల్ఎండీ నుంచి నీటిని కిందికి వదలకుండా బస్తాలతో అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికే ఆ పని చేయాల్సినా ఉన్నా.. కింది ప్రాంతాలు కూడా తెలంగాణ వాసులేనని అకడ పంట పొట్టకు వచ్చిన దశలో ఉందని నీటిని వదులుతున్న ఉద్యమించడం లేదన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే నగర నీటి ఇబ్బందులు రాకుండా చూడాలని, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజల తరుపున ఉద్యమాలు చేయాల్సి వస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో నగరంలో మహిళలు నీటి కోసం బిందెలు తీసుకొని రోడ్లపైకి వచ్చే పరిస్థితి రాలేదని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు వస్తే చూస్తూ ఊరుకునేది లేదని, తాము పోరాటం చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు రాజేందర్రావు, ఐలేందర్, వాల రమణారావు, మేచినేని అశోకరావు, మాజీ ప్రజాప్రతినిధులు సంపత్రావు, తిరుపతినాయక్, తదితరులు పాల్గొన్నారు.