గంగాధర, మార్చి 18 : గంగాధర గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వారసంత వేలం రసాభాసగా మారింది. ఎంపీడీవో రాము, ఎంపీఓ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో వారసంత వేలం నిర్వహించగా నిబంధనల ప్రకారం వేలం నిర్వహించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సమయం మించిపోయిన తర్వాత టెండర్లు స్వీకరించారని గ్రామస్తులు ఆరోపించారు. గతంలో వేలంలో వారసంతను దక్కించుకున్న వారు ఏడాది ముగిసిన పూర్తి డబ్బులు చెల్లించక పోయిన తిరిగి వేలంలో పాల్గొనడానికి అవకాశం కల్పించారని గ్రామస్తులు తెలిపారు.
గత కరోనా సమయంలో వార సంతకు సంబంధించిన డబ్బులను కాంట్రాక్టర్ చెల్లించకపోవడంతో, అధికారులు మాఫీ చేశారని గ్రామస్తులు ఆరోపించారు. వారసంత ద్వారా ఏడాదికి కోటిన్నరకు పైగా ఆదాయం వస్తున్న గ్రామ అభివృద్ధి జరగడంలేదని, కనీసం పారిశుద్ధ్య నిర్వహణను కూడా సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామస్థులు అధికారులను ప్రశ్నించారు. కాగా వారసంత వేలాన్ని వాయిదా వేసినట్లు గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో రాము తెలిపారు.