ACB | గంగాధర, మే 12 : గంగాధర ఇన్చార్జ్ సబ్ సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న మంద కిరణ్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గత ఏడాది పెద్దపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న సమయంలో రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో భాగంగా ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుదారుల నుండి తన ప్రైవేటు సహాయకుడు బిట్టు అలియాస్ రత్నకుమార్ ద్వారా ముడుపులు స్వీకరించినట్లు తేలింది. 27అక్టోబర్ 2025 నుండి 12నవంబర్2025 వరకు యూపీఐ చెల్లింపుల ద్వారా రూ.1,06,500 లంచంగా స్వీకరించినట్లు తేలింది. అధికార దుర్వినియోగానికి పాల్పడి, రిజిస్ట్రేషన్లకు సంబంధించి అక్రమంగా లంచం స్వీకరించినట్లు తేలింది. దీంతో మంగళవారం నిజామాబాద్‌లోని కిరణ్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం కోసం వేధిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేయాలని లేదా 9440446106 కు వాట్సాప్ చేయాలని సూచించారు. ఈ తనిఖీలల్లో ఇన్స్పెక్టర్లు ప్రేమ్ కుమార్, పున్నం చందర్, తిరుపతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.