Robbers Arrested | రాయికల్, ఆగస్టు 16 : రాయికల్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో జరిగిన వరస దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రవిచంద్ర పేర్కొన్నారు. జగిత్యాలలో డీఎస్పీ దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠా వివరాలను శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు రాయికల్ పట్టణ శివారులోని లలితమ్మ ఆలయ సమీపంలో గల మామిడి తోటలో దొంగల ముఠా ఉన్నట్లు తెలుసుకున్న జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రాయికల్ ఎస్సై సుధీర్‌రావు అక్కడికి వెళ్లి దొంగల ముఠాను పట్టుకున్నారన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మండల పల్లి గ్రామానికి చెందిన వనం పాపయ్య, జగిత్యాల టీఆర్‌నగర్‌కు చెందిన వనం రాము, దాసరి రవిని అరెస్టు చేయగా, బాన్సువాడకు చెందిన జగన్నాథం కృష్ణ పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రాయికల్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఆరు కేసుల్లో వీరు నిందితులుగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. దొంగల ముఠా నుండి 12 తులాల బంగారం, రూ.15 వేల నగదు, ఒక కారు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన నిందితులందరూ ఒక ముఠాగా ఏర్పడి రాయికల్, జగిత్యాల, మల్యాల, భూపాలపల్లి, భద్రాచలంలో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు.
వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లో 20 కి పైగా దొంగతనం కేసులో నమోదయ్యాయన్నారు. నిందితులపై అలవాటు పడ్డ నేరస్తుల కింద షీట్ ఓపెన్ చేసి నిరంతర నిఘా ఉంచుతామన్నారు. వరుస దొంగతనాలకు పాల్పడిన దొంగలను చాకచక్యంగా పట్టుకున్న జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్సై సధాకర్, రాయికల్ ఎస్సై సుధీర్ రావు, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్, సుమన్‌లను జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ అభినందించి నగదు బహుమతిని అందజేశారు.