‘జై బోలో గణేశ్ మహారాజ్‌కీ..’ ‘గణపతి బప్పా మోరియా..’ నినాదాలు.. డప్పు చప్పుళ్ల హోరు.. అతివల కోలాటాలు.. యువతీయువకుల నృత్యాలు.. చిన్నారుల కేరింత మధ్యన జిల్లావాసులు గౌరీసుతుడికి ఘనవీడ్కోలు పలికారు. నవరాత్రులు ఘనమైన పూజలందుకున్న గణేశుడిని, శుక్రవారం విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో ఉంచి కనుల పండువలా శోభాయాత్రలు తీశారు. దారిపొడవునా జనం నీరాజనం పట్టగా, చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేశారు. ‘పోయిరా గణపయ్యా పోయిరా’ అంటూ సాగనంపారు. కరీంనగర్లో టవర్ సర్కిల్ వద్ద మంత్రి గంగుల కమలాకర్ శోభాయాత్రను ప్రారంభించగా, ధర్మపురిలో మంత్రి కొపుల ఈశ్వర్, మిగతా చోట్ల ఎమ్మెల్యేలు పూజలు చేశారు.
కరీంనగర్ టవర్ సర్కిల్లో వినాయకుడికి పూజలు చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ కర్ణన్, మేయర్ సునీల్‌రావు
కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్ 9 : తొమ్మిది రోజులపాటు ఘనమైన పూజలు అందుకున్న గణేశుడికి శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. అందంగా ముస్తాబు చేసిన వాహనాల్లో వినాయకుడి ప్రతిమలను ఉంచి డప్పు చప్పుళ్లు, యువతీయువకుల నృత్యాలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా కదిలారు. దారిపొడవునా మహారాష్ట్ర, పూణే నుంచి తెప్పించిన ప్రత్యేక బ్యాండ్‌మేళా చప్పుళ్ల మధ్య భక్తులు నృత్యాలు చేశారు. ‘జై బోలో గణేశ్ మహారాజ్‌కీ.. గణపతి బొప్పా మోరియా..’ నినాదాలతో హోరెత్తించారు. కరీంనగర్‌లోని విగ్రహాలను కొత్తపల్లి, మానకొండూర్ చెరువులతోపాటు చింతకుంట కెనాల్ వద్ద.. మిగతా జిల్లాల్లో చెరువులతోపాటు గోదావరి నది, మానేరువాగులో నిమజ్జనం చేశారు. నగరంలోని ఒకటో నంబర్ గణనాథుడి వద్ద మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్‌రావు, కలెక్టర్ కర్ణన్, సీపీ సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం టవర్‌సర్కిల్ వద్ద ఒకటో నంబర్ గణపతికి స్వాగతం పలికి అర్చకులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవ సమితి, వీహెచ్‌పీ, బజరంగ్దళ్ నిర్వాహకులు పూజలు చేసి, ర్యాలీ ప్రారంభించారు. తిలక్ యూత్ సభ్యులు తమిళనాడు నుంచి రప్పించిన డప్పు కళాకారులు ఆకట్టుకున్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ మానకొండూర్‌లో చెరువు కట్ట వద్ద వినాయకుడికి కొబ్బరికాయ కొట్టి, నిమజ్జనాన్ని ప్రారంభించారు. హుజూరాబాద్‌లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ వేడుకల్లో పాల్గొన్నారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత గణేశ్ విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేయగా, పెద్దపల్లిలోని మినీట్యాంక్‌బండ్ వద్ద ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు సీపీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. గోదావరిఖనిలోని చౌరస్తాలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యేక పూజలు చేసి, శోభాయాత్రను ప్రారంభించారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి : మంత్రి ఈశ్వర్
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గణనాథున్ని కోరుకున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ధర్మపురిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. శోభాయాత్రగా వస్తున్న గణనాథులకు నంది చౌక్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గణనాథుని ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ది పథంలో నడుస్తున్నదన్నారు. ముఖ్యంగా ధర్మపురి పట్టణం కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు.