సద్దుల బతుకమ్మ అంటే గ్రామాల్లో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అందుకు తగినట్టుగానే స్థానిక పంచాయతీల్లో ఏర్పాట్లు చేస్తారు. కానీ, కాంగ్రెస్ పాలనలో పంచాయతీల పరిస్థితి అధ్వానంగా మారింది. గడిచిన ఇరవై నెలలుగా ఎన్నికలు లేక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక నిర్వహణ గాడితప్పింది. ఇప్పటికే రోజువారీ పనుల నిర్వహణకు సొంతంగా ఖర్చులు పెడుతూ అప్పులపాలైన కార్యదర్శులపై ఇప్పుడు బతుకమ్మ, దసరా పండుగల బాధ్యత పడింది. గతేడాది పండుగలకు పెట్టిన ఖర్చులే ఇప్పటి వరకు చేతికి రాలేదని, ఇప్పుడెక్కడి నుంచి తెచ్చేదని సెక్రటరీలు నిస్సహాయతను వ్యక్తంచేస్తున్నారు. కనీసం పెట్టిన బిల్లులైనా ఇప్పిస్తే బతుకమ్మ ఏర్పాట్లకు ఖర్చు చేస్తామని చెబుతున్నారు. లేని పక్షంలో వేలకు వేలు ఖర్చు పెట్టలేమని చేతులెత్తేస్తున్నారు.
కరీంనగర్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో పంచాయతీల పరిస్థితి దారుణంగా మారింది. సర్పంచుల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే గడిచిన ఇరవై నెలలుగా ఎలాంటి నిధులు రావడం లేదు. ఇటు రాష్ట్రం కూడా నయాపైసా ఇవ్వడం లేదు. పైగా చేసిన పనుల బిల్లులు కూడా చెల్లించడం లేదు. పారిశుధ్యం, తాగు నీటి సరఫరాకు అయ్యే ఖర్చులే భరించ లేని స్థితిలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు, ఇప్పుడు సద్దుల బతుకమ్మ, దసరా పండుగల పూట నిస్సహాయతను వ్యక్తంచేస్తున్నారు.
ఏడాదికోసారి వచ్చే సద్దుల బతుకమ్మ వేడుకలు ఎంత చిన్న గ్రామమైనా ఘనంగా నిర్వహించుకుంటారు. సర్పంచులు ఉన్నప్పుడు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసేవారు. ఖర్చులు కూడా పెట్టుకునే వారు. పంచాయతీ నిధుల నుంచి పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణతోపాటు లైటింగ్ ఏర్పాట్లు చేసే వారు. కానీ, ఇరువై నెలలుగా పంచాయతీలకు ఎన్నికలు లేక భారమంతా కార్యదర్శులపైనే పడుతున్నది. నిత్యం పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్యుద్దీపాల నిర్వహణ పనులు తప్పని సరిగా చేయాల్సి ఉంటుంది.
జీపీల్లో నిధులు లేకపోవడం, ఉన్నా వాటిని వినియోగించుకోవడంలో ప్రభుత్వం ఆంక్షలు విధించడం వంటి కారణాలతో సెక్రటరీలు సొంతంగా భరించాల్సి వస్తున్నది. గడిచిన ఇరవై నెలల నుంచి గతేడాది జూన్లో ఒక్కసారి మాత్రమే బిల్లులు పాసైనా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడా విడిపించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే చేసిన అప్పులు తలకు మించిన భారంగా మారిన నేపథ్యంలో బతుకమ్మ, దసరా పండుగలకు ఏర్పాట్లు ఎలా చేయాలో తెలియక కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికీరాని గతేడాది బిల్లులు
పంచాయతీ పాలకవర్గాలకు 2024 ఫిబ్రవరి 2తో గడువు ముగిసింది. ఆ తర్వాత పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రత్యేకాధికారులు నామమాత్రంగా మిగిలిపోయారు. ప్రతి పనిని కార్యదర్శుల చేతనే చేయిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా వీరికే ఆదేశాలు ఇస్తున్నారు. గతేడాది బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించే బాధ్యత కూడా కార్యదర్శులకే ఇచ్చారు.
బతుకమ్మ, దసరా వేడుకలు జరిగిన చోట పారిశుధ్యం, నీటి వసతి, లైటింగ్ ఏర్పాట్లకు పెద్ద పంచాయతీ అయితే 75 వేలు, చిన్న పంచాయతీలైతే 50 వేలు ఖర్చు చేసుకునే అవకాశం ఇచ్చారు. అదే ప్రకారం ప్రతి కార్యదర్శి పంచాయతీల స్థోమతను బట్టి ఖర్చుచేసి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రెజరీకి బిల్లులు పంపించారు. కానీ, ఇప్పటి వరకు ఆ బిల్లులు రాలేదని వాపోతున్నారు. ఇపుడు ఈ పండుగలను గట్టెక్కిందెలా..? అని తలలు పట్టుకుంటున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పెద్ద పంచాయతీల్లో 75 వేలు, చిన్న పంచాయతీలైతే 50 వేల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాము ఈ ఖర్చులు ఎలా పెడతామని ప్రశ్నిస్తున్నారు.
జనరల్ ఫండ్ ఉన్నా లేనట్టే
పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాత కేంద్రం నుంచి వచ్చే 16వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్రం నుంచి వచ్చే స్టేట్ ఫైనాన్స్ నిధులు రావడం లేదు. ఇంటి పన్నులు, నీటి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న జనరల్ ఫండ్ పెద్ద మొత్తంలో ట్రెజరీకి జమ చేస్తున్నారు. అధికారుల ఒత్తిడి మేరకు పంచాయతీ కార్యదర్శులు ఈ పన్నులు పెద్ద మొత్తంలోనే వసూలు చేస్తున్నారు. జిల్లా మొత్తంలో ఈ ఆర్థిక సంవత్సరం 50 శాతం వసూలైనట్టు తెలుస్తున్నది. వసూలు చేసిన ఈ ఐఎఫ్ఎంఎస్ పద్దుల కింద జమ చేయడమేగానీ, బిల్లుల కోసం తిరిగి తీసుకునే పరిస్థితి లేదు. గతేడాది జూన్లో చివరి సారిగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పాస్ చేసింది.
ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క గ్రామ పంచాయతీకి కూడా బిల్లులు పాస్ చేసిన సందర్భం లేదు. జనరల్ ఫండ్ నుంచి సిబ్బంది వేతనాలు కూడా ఇచ్చే అవకాశం లేదు. ఎన్ని బిల్లులు పెట్టినా, ఎన్నిసార్లు మండల, జిల్లా స్థాయి అధికారులను కలిసినా ఒక్క బిల్లు పాస్ కావడం లేదని కార్యదర్శులు వాపోతున్నారు. సిబ్బంది వేతనాలు టీజీబీపాస్లో వేస్తామని అధికారులు చెబుతున్నారు. నాలుగు నెలలుగా సిబ్బందికి వేతనాలు రాకపోవడంతో అది కూడా కార్యదర్శులకు భారంగా మారింది. ప్రతి గ్రామ పంచాయతీకి గత ప్రభుత్వం ట్రాక్టర్లు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. వీటి నిర్వహణ కూడా కార్యదర్శులకు కష్ట తరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలను నెట్టుకొస్తున్న కార్యదర్శులకు బతుకమ్మ, దసరా ఉత్సవాలు నిర్వహించడం కత్తిమీద సాములా మారింది.
అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల నుంచి కార్యదర్శులకు ఒత్తిళ్లు తప్పడం లేదు. బతుకమ్మ ఏర్పాట్లపై గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులతో కలిసి అధికార పార్టీ నాయకులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. పండుగ ఖర్చులు కార్యదర్శులు భరించాలని, తర్వాత బిల్లులు పెట్టుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది. గతేడాది భరించిన ఖర్చులే ఇప్పటి వరకు రాలేదని, ఈ ఖర్చులు ఎలా భరించేదని కొందరు కార్యదర్శులు వాపోతున్నాఉ. ఇలాంటి వారిపై ఫిర్యాదులు చేస్తామని అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు.
సర్పంచులుగా పోటీ చేయాలని ఆశిస్తున్న కొందరు నాయకులు ముందుకొచ్చి ఖర్చులు భరిస్తామని, తర్వాత బిల్లులు ఇవ్వాలని కార్యదర్శులకు చెబుతున్నట్టు తెలుస్తున్నది. మొత్తానికి బతుకమ్మ, దసరా పండుగలు గతంలో సర్పంచుల ఆధ్వర్యంలో నిర్వహించేది. ఇప్పుడా పరిస్థితి లేక చాలా మంది పంచాయతీ కార్యదర్శులు ఒత్తిడికి గురవుతున్నారు. అప్పులు చేయక తప్పని పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారు.