TBGKS | గోదావరిఖని, ఆగస్టు 20: సింగరేణి సంస్థ కు కొత్త బొగ్గు గనులు తీసుకురాకుండా గారడి మాటలతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని రాష్ట్ర మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. తెలంగాణ భవన్ లో బుధవారం జరిగిన టీబీజీకేఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
కొత్త బొగ్గు గనుల సాధన కోసం, ఆదాయ పన్ను రద్దు కోసం ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తామని, కార్మిక సమస్యల పరిష్కారం కోసం సింగరేణి భవన్ ను ఎదుట నిరసన పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సింగరేణి సంస్థ భవిష్యత్తు కొత్త బొగ్గు గనులను సాధించడంతోనే ముడిపడి ఉన్నదని సమావేశం అభిప్రాయపడింది. ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని సమావేశం డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నాలుగు ఉమ్మడి జిల్లాలలోని బొగ్గుబ్లాకులను సింగరేణికే కేటాయించి, కార్మికుల భవిష్యత్తును, తెలంగాణ ప్రజల ఉపాధి అవకాశాలను కాపాడాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బొగ్గు గనులు సింగరేణి సంస్థకు కేటాయించే విధంగా చొరవ చూపాలని, ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది. ఇన్కమ్ టాక్స్ ను బొగ్గు గని కార్మికులకు రద్దు చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది.
సింగరేణి సంస్థ 2024- 25 సంవత్సరంలో సాధించిన లాభాలను వెంటనే ప్రకటించాలని, అందులో నుండి 35% వాటాను కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేసింది. 190/240 మాస్టర్లు పూర్తి చేసుకున్న బదిలీ వర్కర్లను వెంటనే పర్మినెంట్ చేయాలని, వివిధ డిజిగ్నేషన్లపై యాక్టింగ్ పనులు నిర్వహిస్తున్న కార్మికులకు ప్రమోషన్ ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న వివిధ డిజిగ్నేషన్ లలో ఖాళీలను పూరిం చాలని డిమాండ్ చేసింది. రూ.40 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేసింది. సింగరేణి సంస్థ పరిరక్షణకు సేవ్ సింగరేణి బచాలో కాంగ్రెస్ కు హటావో పేరిట సింగరేణి యాత్ర నిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించిందన్నారు.
టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, బాల్క సుమన్, పుట్ట మధుకర్, కోరుకంటి చందర్, హరిప్రియ నాయక్, చిన్నయ్య, దివాకర్ రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి సీనియర్ ఉపాధ్యక్షులు నూనె కొమురయ్య, ఉపాధ్యక్షులు బడికల సంపత్ మంగీలాల్ తో పాటు 10 డివిజన్లో ఉపాధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గం కౌన్సిల్ సభ్యులు అత్యధికంగా హాజరయ్యారు.
టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను టీబీజీకేఎస్ కేంద్ర జనరల్ కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, సంఘం గౌరవాధ్యక్షుడుగా కొప్పుల ఈశ్వర్ పేరును ప్రతిపాదించగా నూనె కొమురయ్య, కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కాపు కృష్ణ బలపరిచారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు ఏకగ్రీవంగా ఈశ్వర్‌ను హర్షధ్వానాల మధ్య
ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో TBGKS అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, వడ్డేపల్లి శంకర్, చెల్పురి సతీష్, చల్ల రవీందర్ రెడ్డి, ఇందూరి సత్యనారాయణ, చిలకలపల్లి శ్రీనివాస్, అబ్దుల్ గని, బొడ్డు రమేష్, ముదంపల్లి రాజేశం, దూట శేషగిరి పాల్గొన్నారు.