Peddapally | పెద్దపల్లి, మార్చ్ 7(నమస్తే తెలంగాణ) : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని రాజీవ్ నగర్‌కు చెందిన డా. బండారి తిరుపతి తన కష్టం, పట్టుదలతో న్యూరోసర్జన్‌గా ఎదిగి యువతకు ఆదర్శంగా నిలిచారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, తెలుగు మాధ్యమంలో చదువుకున్న ఆయన ప్రయాణం ఎంతో ప్రేరణాత్మకంగా నిలిచింది. డాక్టర్ బండారి తిరుపతి తన ప్రాథమిక విద్యను తాండూర్లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు అభ్యసించారు. అనంతరం శ్రీ విష్ణు శివనికేతన్ హై స్కూల్, తాండూర్ లో ఏరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్నారు.
తర్వాత బెల్లంపల్లిలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. విద్యాభ్యాసంలో మధ్యలో కొన్ని అపజయాలు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. కఠినంగా శ్రమించి 2009లో నిర్వహించిన ఈఎంసెట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 72వ ర్యాంక్ సాధించడంతో పాటు భౌతిక శాస్త్రంలో రాష్ట్ర ప్రథమ స్థానం సాధించి ఎంబీబీఎస్ సీటు పొందారు. ఆ తర్వాత కరీంనగర్ లోని చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం నీట్ పీజీ పరీక్షలో ఎంఎస్ జనరల్ సర్జరీ సీటు సాధించి అదే కళాశాలలో పీజీ పూర్తి చేశారు. సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తూ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలకు సిద్ధమై నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో 68వ ర్యాంక్ సాధించి హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ లో డీఎన్బీ న్యూరోసర్జరీ రెసిడెన్సీలో చేరారు.
తన ప్రతిభతో శుక్రవారం వచ్చిన ఫలితాలలో న్యూరోసర్జరీ ఎగ్జిట్ పరీక్షలో ఆల్ ఇండియా 4వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో ఒకటో ర్యాంక్ సాధించి విశిష్ట ప్రతిభ కనబరిచారు. ప్రస్తుతం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ లో కన్సల్టెంట్ న్యూరోసర్జన్‌గా పనిచేస్తూ అడ్వాన్స్డ్ బ్రెయిన్, స్పైన్ సర్జరీల్లో నిపుణుడిగా సేవలందిస్తున్నారు. కుగ్రామం నుంచి, తెలుగు మాధ్యమంలో చదువుకుని, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక విద్యార్థి న్యూరోసర్జన్‌గా ఎదగడం సాధారణ విషయం కాదు. డాక్టర్ బండారి తిరుపతి యువతకు స్ఫూర్తినిచ్చే గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. ఆయన జీవన ప్రయాణం ఒక సందేశాన్ని ఇస్తోంది. ‘పట్టుదలతో కష్టపడితే అసాధ్యం అనేది ఏదీ లేది’ అని నిరూపిస్తున్నది.