Darmaram | ధర్మారం, మే 22: తోటి స్నేహితుడు అనారోగ్యంతో మరణించడంతో అతనితో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. తమకు తోచినంత సహాయాన్ని అందించి ఇంకా మానవత్వం ఉందని ఆ స్నేహితులు నిరూపించారు. కష్టకాలంలో కుటుంబానికి సహాయం చేసిన సదరు స్నేహితుల ఆధ్వర్యంలో బాధ్యత కుటుంబంతో పాటు వారిని గ్రామస్తులు అభినందించారు. వివరాలలోకి వెలితే .. పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన ముక్కెర గోపి గౌడ్ (35) అనే యువకుడు అనారోగ్యంతో మరణించాడు.
గోపి గౌడ్ కు భార్య స్రవంతి తో పాటు ఇద్దరు కూతుర్లు శివాని (8), భవ్య (6)ఉన్నారు. కుటుంబాన్ని పోషిస్తూ గోపి గౌడ్ ఎంతో ఆనందదాయకంగా ఉన్న సమయంలో అతడు గత ఏడాది క్రితం అనారోగ్యానికి గురైనాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. గోపి గౌడ్ ను కాపాడడానికి చివరికి అతనికి ఉన్న ఒక ఎకరం పొలం కూడా అమ్మేశారు. కానీ అతనికి సోకిన ప్రాణాంతక వ్యాధి వెంటాడుతూ వచ్చింది. పరిస్థితి విషమించి ఇటీవల మరణించాడు.
గోపి గౌడ్ మరణించడం అతని కుటుంబం ఆర్థికంగా చితికి పోవడంతో ఆపదలో ఉందని తెలుసుకొని అతనితో అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-06 టెన్త్ బ్యాచ్ చదువుకున్న తోటి మిత్రులు మానవతా దృక్పథంతో సహాయం అందించి ఆదుకోవాలని సంకల్పించారు. టెన్త్ ఇంటర్, డిగ్రీ చదువుకున్న మిత్రులందరికీ కలిసి తమకు తోచినంత విరాళాన్ని ప్రోగు చేశారు. సుమారు రూ.80,000 డబ్బులు జమ చేశారు. ప్రోగు చేసిన అట్టి సొమ్మును గోపి గౌడ్ ఇద్దరి కూతుర్ల పేరిట బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.
ఈ క్రమంలో గురువారం గోపి గౌడ్ ఇంటిలో పెద్దకర్మ జరిగిన సందర్భంగా స్నేహితులు పరమేష్, గీత,శ్రీను,నరేష్, గణేష్, ప్రవీణ్ బాలు, కిరణ్,జితేందర్, జావీద్, మల్లేష్, రమేష్ సుదీర్, సురేష్ తదితరులు హాజరై మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం గోపి గౌడ్ పిల్లల పేరిట ఫిక్స్డ్ చేసిన డిపాజిట్ పత్రాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేశారు. మానవతా దృక్పథంతో సహాయం చేసిన వారికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు వీరిని అభినందించారు.