కొత్తపల్లి, ఆగస్టు 11: స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మువ్వన్నెల సంబురం అంబరాన్నంటింది. నాలుగో రోజు గురువారం నిర్వహించిన ఫ్రీడం రన్ ఉత్సాహంగా సాగింది. నగరంతోపాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో వందలాది మంది తరలిరాగా, దేశభక్తి ఉప్పొంగింది. నగరంలో కోర్టు చౌరస్తా నుంచి ఆర్ట్స్ కళశాల వరకు రన్ సాగింది. దారి పొడుగునా వేలాది గొంతుకలు ఏకమై ‘భారత్ మాతాకీ జై’ అంటూ చేసిన నినాదాలతో ప్రతి వీధి ప్రతిధ్వనించింది. 500 మీటర్ల జాతీయ పతాకం ప్రత్యేకార్షణగా నిలిచింది. విద్యార్థులు, నాయకులు, వివిధ స్వచ్ఛంద సంస్థల బాధ్యులు తరలిచ్చారు.
త్రివర్ణ పతాకాలను చేతబూని ముందునడిచారు. ఆర్ట్స్ కళాశాల సమీపంలోని భారీ జాతీయజెండా వద్ద జాతీయ గీతాలాపన చేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు. వారి స్ఫూర్తితో ముందుకెళ్తామని ప్రతిన బూనారు. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్ముడి పాత్రను గుర్తు చేసుకున్నారు. జాతీయ సమైక్యతకు తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఫ్రీడం రన్లో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి, జడ్పీ చైర్పర్సన్ విజయ, మేయర్ సునీల్‌రావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తదితరులు పాల్గొని ముందునడిచారు.