మహిళలను క్యాన్సర్ ముప్పు వెంటాడుతున్నది. ఒకప్పుడు రొమ్ము క్యాన్సర్ లాంటివి ఉంటే.. ఇప్పుడు గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ భయపెడుతున్నది. నేషనల్ క్యాన్సర్ పర్సనల్ రికార్డ్స్ (ఎన్సీఆర్పీ) అంచనా ప్రకారం దేశంలో ఏటా కొత్తగా ఏడు లక్షలకుపైగా కేసులు నిర్ధారణ అవుతుంటే.. అందులో 63 శాతం మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితికి అద్దం పడుతున్నది. అందుకు అనేక కారణాలు కనిపిస్తుండగా, ప్రభుత్వ వైద్యశాలల్లో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స సదుపాయాలు లేకపోవడం కూడా మరో కారణం అవుతున్నది.
ఈ మహమ్మారి లక్షణాలపై అవగాహన లేకపోవడం, ప్రాథమికదశలో చికిత్సవైపు అడుగులు వేయకపోవడం కూడా ప్రాణాలను బలిగొంటున్నాయి. నిజానికి ఉచిత అవగాహన శిబిరాలు నిర్వహించి ప్రజలను ముఖ్యంగా మహిళను చైతన్యం చేయాలని అనేకసార్లు ప్రపంచ ఆరోగ్య సంస్థలు హెచ్చరించినా.. దానిని పెడచెవిన పెట్టడం వల్లే ఈ సమస్య పెనుభూతంలా మారిందన్న విమర్శలున్నాయి
. అయితే, ఇటీవలి కాలంలో సర్వైకల్ క్యాన్సర్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కొంత దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నా.. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపితేనే ఈ ముప్పు నుంచి బయటపడే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతిమ, చల్మెడ కాన్సర్ ఇన్స్టిట్యూషన్ల సహకారంతో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు కరీంనగర్లో మహిళలకు ఉచిత క్యాన్సర్ అవగాహన, నిర్ధారణ పరీక్షల వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వినోద్‌కుమార్ సూచించారు.
కరీంనగర్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇటీవలి కాలంలో క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నది. దేశం, రాష్ట్రం, ఉమ్మడి జిల్లాలో మెల్లమెల్లగా విజృంభిస్తున్నది. అవగాహన లేక ఆ మహమ్మారిని గుర్తించలేని పరిస్థితి ఉంటున్నది. తీరా గుర్తించే సమయానికి అప్పటికే పరిస్థితి చేజారి పోతున్నది. దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ఎన్సీఆర్పీ అంచనాల ప్రకారం.. ఏడాదిలో ఏడు లక్షలకుపైగా క్యాన్సర్ కేసులు నిర్ధారణ అవుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అందులో 63 శాతం మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రసిద్ధ లాన్సెట్ పత్రిక ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం 2019 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అదే ఏడాది ఈ మహమ్మారి బారిన పడ్డ 9.30 లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. ఆసియా మొత్తం మీద చూస్తే క్యాన్సర్ మరణాల్లో చైనా తర్వాత ఇండియా రెండో స్థానంలో ఉన్నది.
సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ద్వారా సోకుతుంది. దీనిని పాప్‌స్మియర్ టెస్టు ద్వారా ముందే గుర్తించవచ్చు. ప్రతి రెండు మూడేళ్లకోసారి ఈ టెస్టు చేసుకోవడం ద్వారా వ్యాధి బారి నుంచి తప్పించుకునే అవకాశమున్నది. అయితే, చాలా మంది కి అవగాహన లేక.. వ్యాధి లక్షణాలు తెలియక వైద్యులను సంప్రదించడం లేదు. దీంతో వ్యాధి ముదురుతున్నది. తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెట్టినా ప్రా ణాలు కాపాడడం కష్టమవుతున్నది. మహిళలు ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నట్టు ఇటీవల అనేక సర్వే లు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఏటా 15 వేల కేసులు నమోదవుతున్నట్టు ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
అలాగే, ఏటా నమోదవుతున్న కేసుల్లో 13 వాతం సర్వైకల్ క్యాన్సర్‌వే ఉంటున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని గుర్తించి న కేం ద్రం, దీనిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. 9 నుంచి 14 ఏండ్ల బాలికలు దీని బారిన పడకుండా ఉం డేందుకు వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహిస్తామని కేంద్ర మం త్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చె ప్పారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు సీరం ఇనిస్టిట్యూట్ దేశీయంగా సర్వవ్యాక్ వ్యాక్సిన్ డోస్‌ను రూ.2 వేలకు అందుబాటులోకి తెచ్చింది. వ్యాక్సిన్ ధరలు తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నా.. స్పష్టత మాత్రం లేదు.
మహిళలు సర్వైకల్తోపాటు వివిధ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. రొమ్ము, పెద్దపేగు, ఉదర, చర్మ, రక్త, ప్రొస్టేట్, కాలేయ.. వంటి క్యాన్సర్ల బాధితులవుతున్నారు. అధిక బరువు కారణంగా తలెత్తే క్యాన్సర్లు.. పురుషుల కన్నా, మహిళల్లోనే ఆరు రెట్లు ఎక్కువ ఉంటున్నాయి. అయితే, దేశంలో ప్రస్తుతం వంద మందిలో ఒక్కరే ముందస్తుగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నట్టు సర్వేల్లో వెల్లడవుతున్నది. చాలామంది వ్యాధి ముదిరిన తర్వాత దవాఖానలకు వెళ్తుండడంతో ప్రాణాపాయం తలెత్తుతున్నది. నిజానికి దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా ఒక కారణం అవుతున్నది.
మెజారిటీ జిల్లా స్థాయి దవాఖానల్లో మహమ్మారి నిర్ధారణ, ట్రీట్మెంట్ సదుపాయా లు అందుబాటులో లేవు. దాంతో అందరూ నగరాలకు వెళ్లాల్సి వస్తున్నది. అక్కడి హాస్పిటళ్లలో చికిత్స కోసం చేసే ఖర్చుతో చాలా కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడే దయనీయ స్థితి ఉంటున్నది. చివరికి వై ద్యం చేయించుకోలేని దుస్థికి చేరుకోవడం కనిపిస్తున్నది. నిజానికి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది పెనుభారంగా మారుతున్నది. దీన్ని తప్పించాలంటే.. ప్రభు త్వ దవాఖానల్లో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలను అందుబాటులోకి తేవాలన్న డిమాండ్ ఎన్నటి నుంచో వస్తున్న ది.
క్యాన్సర్ ఔషధాలు తక్కువ ధరకే లభించేలా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నది. మనుషుల్లో వచ్చే 18 రకాల క్యాన్సర్లను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు అమెరికా పరిశోధకులు డీఎన్ఏ పరీక్షను కనుగొన్నారు. ఇలాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశంలో కూడా అతి తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తే లక్షల మందికి మేలు కలుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిమ క్యాన్సర్, చల్మెడ కాన్సర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 7 వరకు ఉచిత క్యాన్సర్ అవగాహన, నిర్ధారణ పరీక్షల వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ గాంధీ రోడ్డులోని టీటీడీ కల్యాణ మండపంలో శనివారం ఉదయం 9 గంటలకు క్యాంపు ప్రారంభిస్తారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నాలుగు రోజుల పాటు శిబిరం ఉంటుందని, అందులో ఉచిత కన్సల్టేషన్, పరీక్షలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
క్యాంపు వివరాల కోసం 9100033082 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే, గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ లక్షణాలను వివరించారు. రొమ్ము పరిమాణం లేదా ఆకృతిలో మార్పు రావడం, రొమ్ములో ఏదైనా ముద్ద లేదా గట్టి పడడం, చనుమొన మీద ఎరుపు దద్దుర్లు రావడం, చనుమొన నుంచి ద్రవాలు రావడం, తిరిగి ఉండడం, చర్మంపై గుంటలు పడడం వంటి రొమ్ము క్యాన్సర్ లక్షణాలని తెలిపారు. అలాగే ఉబ్బరం, పొత్తి కడుపు నొప్పి, తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపించడం, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాలని అనిపించడం వంటివి అండాశయ కాన్సర్ లక్షణాలని, అలాగే, అసాధారణ రక్తస్రావం, సెక్స్ తర్వాత రక్తస్రావం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మెనోపాజ్ తర్వాత దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జి అవడం వంటివి సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలని చెప్పారు.
అందరూ సమష్టి కృషి చేస్తేనే క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. అమెరికా లాంటి దేశాల్లో ఏడాదికోసారి క్యాన్సర్‌కు సంబంధించిన స్కానింగ్ చేయించుకుంటారు. మన దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి చైతన్యం రావాలి. నిజానికి ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తిస్తే.. రెండు డోసుల ద్వారా 95 శాతం నివారించవచ్చు. కానీ, చాలా మందికి ఈ విషయం తెలియక చివరి నిమిషంలో ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. ఆ సమయంలో వైద్యులు చికిత్స అందించినా.. ఆశించిన ప్రయోజనం ఉండడం లేదు. మా పరిశీలన ప్రకారం.. క్యాన్సర్ వ్యాధి లక్షణాలపై చాలా మందికి అవగాహన ఉండడం లేదు.
ఆ కారణంగానే ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి ఉంటున్నది. అందుకే విస్తృతంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి.. మహిళలను చైతన్యం చేయాల్సిన అవసరమున్నది. అప్పుడే ఈ ముప్పునకు అడ్డుకట్ట వేయచ్చు. అన్ని రకాల క్యాన్సర్లకు సంబంధించి నేటి నుంచి ప్రారంభమయ్యే శిబిరంలో నిపుణులు విలువైన సూచనలు ఇస్తారు. ఈ తరహా శిబిరాలు గ్రామగ్రామాన నిర్వహించాలి. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు విస్తృత అవగాహన కల్పించాలి. అంతేకాదు, క్యాన్సర్లకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సంఘాలు, వ్యవస్థలతోపాటు ప్రతి ఒక్కరూ ప్రధానంగా భాగస్వాములవ్వాలి. ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం, ఆధునిక పద్ధతుల్లో స్క్రీనింగ్, నాణ్యమైన చికిత్స, టీకా కార్యక్రమాల వంటివి అందుబాటులోకి వస్తే ఈ ముప్పు నుంచి బయటపడే అవకాశమున్నది.
– బీ మాధవి, గైనకాలజిస్ట్