Odela | ఓదెల, ఏప్రిల్ 26 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అంధత్వ రహిత సమాజమే లక్ష్యంగా ఓదెలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్థానిక వివేకానంద విద్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం వరకు కొనసాగింది. శిబిరంలో అత్యాధునిక కంప్యూటర్ యంత్రాల ద్వారా రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈ శిబిరాన్ని మాజీ ఎంపీటీసీ బోడకుంట శంకర్, లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ నేత్రవైద్య నిపుణులు పూదరి దత్తాగౌడ్, నేత్రవైద్య సహాయకులు లగిశెట్టి వంశీ సహకారంతో ఈ శిబిరం నిర్వహించారు. కంటి పొరలు, కంటిపై దురమాంసం వంటి సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి, వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేవలం ఆపరేషన్లే కాకుండా రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఉచిత వాహన సౌకర్యం, శస్త్రచికిత్స సమయంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు.
ఆదివారం పరీక్షలు చేయించుకున్న బాధితులను, రాబోయే బుధవారం శస్త్రచికిత్సల నిమిత్తం ప్రత్యేక వాహనాల్లో తరలించనున్నారు. ఈ సేవా కార్యక్రమంలో మూల ప్రేమ సాగర్ రెడ్డి, ఆళ్ల సుమన్ రెడ్డి, గీతాంజలి డిగ్రీ కళాశాల కరెస్పాండంట్ పల్కపాటి రాజేష్ కుమార్, బోడకుంట చిన్న స్వామి, రాంచందర్, బుద్దే రవి చంద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఇలాంటి ఉచిత శిబిరాలు నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.