సిరిసిల్ల/ సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 15 : ‘బావులు, బోర్ల మోటర్లకు మీటర్లు పెట్టే వాళ్లు కావాలా..? నిరంతరంగా ఉచిత విద్యుత్ అందించే వాళ్లు కావాలా..? ఎవరు కావాలో రైతులు తేల్చుకునే సమయం ఆసన్నమైంది’ అని మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సెస్ నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ బల పరుస్తున్న అభ్యర్థులకు మద్దతుగా హాజరయ్యా రు. అనంతరం మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరు ప్రవీణ్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, నాయకులు పాల్గొన్నారు.
కరెంటు దొంగలు.. బీజేపీ నేతలు: ఎమ్మెల్యే రసమయి
విద్యుత్‌ను ప్రైవేటీకరణ చేసి అమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, బీజేపీ నేతలు కరెంటు దొంగలు అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారితో పార్టీకి అవినాభావ సంబంధం ఉన్నదన్నారు. రైతులను కాపాడుకునే రాష్ట్రంగా తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ఉమ్మడి పాలనలో అనేక కష్టాలు పడ్డ రైతులకు తెలంగాణ వచ్చిన తర్వాత నిరంతరంగా ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తున్నదని, ఇంతవరకు ఏ రైతుకు కూడా సబ్సిడీ అందలేదని, బడా వ్యాపారులకు మాత్రం సబ్సిడీలు అందిస్తూ అదానీ, అంబానీలను తయారుచేస్తున్నదని విమర్శించారు. రైతులకు సేవ చేసేందుకు సెస్ డైరెక్టర్లు ఉన్నారని, బీఆర్ఎస్ మద్దతుదారులకు ఓటేయాలని కోరారు. సెస్ పరిధిలోని 15 డైరెక్టర్ల స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలపాలని పిలుపునిచ్చారు.
రైతుల గోస తీరింది : ఎమ్మెల్యే సుంకె
కేసీఆర్ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రైతుల కరెంటు గోస తీరిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గుర్తు చేశారు. ఎనిమిదేండ్ల క్రితం కరెంటు ఎప్పుడు వస్తుం దో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉం డేదని, ఇప్పుడు నిరంతరం విద్యుత్ సరఫరా అందించే స్థాయికి రాష్ట్రం ఎదిగిందన్నారు. నేత కార్మికుల బాధలు తొలగిపోయాయన్నారు. సీఎం కేసీఆర్ అన్నదాతల సంక్షేమమే ధ్యేయం గా పని చేస్తున్నారని చెప్పారు. 2.80 లక్షల వినియోగదారులున్న సెస్ సంస్థను కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతివ్వాలన్నా రు. సెస్ పరిధిలోని డైరెక్టర్ స్థానాలన్నింటిలో భారీ విజయాన్ని అందించాలని కోరారు.
స్వరాష్ట్రంలో పండుగలా వ్యవసాయం: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందని, రైతులు సంతోషంగా ఉన్నార ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. అవసరానికి సరిపడా సబ్స్టేషన్ల ఏర్పాటుతో నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు 24 గం టలు అందిస్తున్నామన్నారు. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత వినియోగదారులపై ఉందని సూచించారు.