కొత్తపల్లి, మే 10 : హైదరాబాద్ క్రికెట్ సహకారంతో కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి జూన్ 12 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బాలబాలికలకు క్రికెట్లో ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు వీ ఆగంరావు, పీ మనోహర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో ఈ శిబిరాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
కరీంనగర్ అల్గునూర్‌లోని వెలిచాల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ మైదానం, గోదావరిఖనిలోని ఆర్జీ-1 మైదానం, జగిత్యాలలోని స్వామి వివేకానంద మినీ స్టేడియం, సిరిసిల్లలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో అండర్-14, 16, 19, 23 విభాగాలకు సంబంధించిన బాల బాలికలు పాల్గొనవచ్చని వివరించారు. క్రీడాకారులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డుతో శిక్షణ పొందే మైదానంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఇతర వివరాలకు 8688768775 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.